CM Jagan : వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులతో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థులతో మాట్లాడిన సీఎం జగన్ మాట్లాడుతూ... గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సామాజిక న్యాయం పాటించామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సీట్లు కేటాయించామన్నారు. మొత్తం 18 స్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ప్రకటించినట్లు సీఎం జగన్ తెలిపారు. వీరిలో 14 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభ్యర్థులే ఉన్నారని తెలిపారు. వైసీపీ చేస్తున్న సామాజిక న్యాయాన్ని ప్రతి గడప తీసుకెళ్లాలని అభ్యర్థులకు సూచించారు. రాష్ట్రంలో ఇంత గొప్ప మార్పు ఎప్పుడూ జరగలేదన్నారు.  ఎమ్మెల్సీలుగా బాధ్యతలు తీసుకునే వాళ్లు పార్టీ కోసం ఏం చేయగలరో ఆ దిశగా పనిచేయాలన్నారు. నేను చేయాల్సింది చేశానని, పార్టీ పరంగా ఎమ్మెల్సీల బాధ్యతను నిర్వర్తించాలన్నారు.  పదవులు పొందుతున్న వారందరూ పార్టీ కోసం కష్టపడాలని కోరారు. పదవుల కోసం ఆశించిన వారు ఇంకా చాలా మంది ఉన్నారన్న సీఎం జగన్... ఉన్న పదవులు తక్కువ కాబట్టి అందర్నీ సంతృప్తి పరచలేమన్నారు. ఆశావహులందరికీ చెప్పే రీతిలో చెప్పుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. 


టార్గెట్ 175 ఫిక్స్ 


బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమచేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. ఇంత పారదర్శకంగా లంచాలకు తావులేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. ఎమ్మెల్సీ పదవుల్లో సామాజిక న్యాయం పాటించామని మరోసారి గుర్తుచేశారు. వైసీపీ పార్టీ స్థాపించి, అధికారంలోకి వచ్చామని దేవుడి దయతో మంచి పాలన కొనసాగిస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు వైసీపీ గెలుచుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో మరింత మెజార్టీ పెరిగితే మరింత మంచిపాలన అందిస్తామన్నారు. 


అందరికీ పదవులు ఇవ్వలేం 


"గతంలో ఎప్పుడూ జరగని విధంగా సామాజిక న్యాయం చేశాం. 18 మంది ఎమ్మెల్సీలలో 14 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మెనార్టీలు ఉన్నారు. ఇంత గొప్పగా ఎప్పుడూ సామాజిక న్యాయం జరగలేదు. ఈ విషయాన్ని ప్రతి గడపకూ తీసుకెళ్లాలి. బటన్ నొక్కి నేరుగా లబ్దిదారులకు నగదు అందిస్తున్నాం. పదవులు తీసుకున్నాక యాక్టివ్ గా ఉండడం చాలా ముఖ్యం. చాలా అగ్రెసివ్ గా ఉండాలి. మీడియా పరంగా మనకు బలం తక్కువ. ఈ పరిస్థితుల్లో మనం వాళ్లను ఎదుర్కోవాలంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండండి. ఎమ్మెల్సీలుగా బాధ్యతలు తీసుకుంటున్న వాళ్లు... పార్టీ కోసం ఏం చేయాలో, ఆ బాధ్యత గుర్తుపెట్టుకోండి. పదవులు పొందిన వాళ్లకు శుభాకాంక్షలు. పదవులు ఆశించిన వాళ్లు చాలా మంది ఉన్నారు. అందరికీ పదవులు ఇవ్వలేం కదా. వాళ్లకు చెప్పే పద్దతిలో చెప్పి, కన్విన్స్ చేయాలి." - సీఎం జగన్


స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులు


1. నర్తు రామారావు (బీసీ- యాదవ), శ్రీకాకుళం జిల్లా
2. కుడిపూడి సూర్యనారాయణ (బీసీ -శెట్టి బలిజ), తూ.గో జిల్లా:
3. వంకా రవీంద్రనాథ్ (ఓసీ - కాపు), ప.గో జిల్లా
4. కవురు శ్రీనివాస్ (బీసీ - శెట్టి బలిజ), ప.గో జిల్లా
5. మేరుగ మురళీ (ఎస్సీ - మాల), నెల్లూరు జిల్లా
6. డా.సిపాయి సుబ్రహ్మణ్యం (వన్య కుల క్షత్రియ), చిత్తూరు జిల్లా
7. రామసుబ్బారెడ్డి (ఓసీ - రెడ్డి), కడప జిల్లా
8. డాక్టర్ మధుసూదన్‌ (బీసీ - బోయ), కర్నూలు జిల్లా
9. ఎస్. మంగమ్మ (బీసీ - బోయ), అనంతపురం జిల్లా


ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులు


1. పెనుమత్స సూర్యనారాయణ(క్షత్రియ సామాజిక వర్గం), విజయనగరం జిల్లా
2. పోతుల సునీత (బీసీ - పద్మశాలి), ప్రకాశం జిల్లా
3. కోలా గురువులు (ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్), విశాఖ జిల్లా
4. బొమ్మి ఇజ్రాయిల్ (ఎస్సీ - మాదిగ), తూర్పు గోదావరి జిల్లా
5. జయమంగళ వెంకటరమణ, (వడ్డీల సామాజిక వర్గం), ఏలూరు జిల్లా
6. చాందగిరి ఏసు రత్నం వడ్డెర (బీసీ), గుంటూరు జిల్లా
7. మర్రి రాజశేఖర్  (ఓసీ  -కమ్మ), పల్నాడు జిల్లా


* గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులు*


1. కుంభా రవి బాబు (ఎరుకుల - ఎస్టీ), అల్లూరి సీతారామరాజు జిల్లా
2. కర్రి పద్మ శ్రీ  (బీసీ - వాడ బలిజ), కాకినాడ సీటీ