CM Jagan : విశాఖపట్నంలో రెండ్రోజుల పాటు నిర్వహించిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ విజయవంతం అయిందని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సమ్మిట్ ను సక్సెస్ చేసి  సంబంధిత శాఖల మంత్రులు, పరిశ్రమల శాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అభినందించారు. విశాఖపట్నంలో మార్చి 3,4 తేదీల్లో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్ నిర్వహించారు. ఈ సమ్మిట్ లో రెండు రోజుల్లో రూ. 13.41 లక్షల కోట్ల పెట్టుబడులు, 378 ఒప్పందాలు, 6.09 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో కంపెనీలు చేసుకున్న ఎంవోయూలు అమలు దిశగా రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీని ఏర్పాటుచేశారు.  కమిటీ ప్రతి వారం సమావేశమై సదస్సులో కుదిరిన ఎంవోయూల అమలు దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రులు, అధికారులకు సీఎం సూచించారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమర్‌నాథ్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్‌ వలవెన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ డా.జి. సృజన, ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌ ఎండీ ఎస్‌.షన్‌మోహన్‌ పాల్గొ్న్నారు. 






ముఖ్యమంత్రి జగన్ కి 'చిరుధాన్యాల' చిత్రపటం బహుకరించిన మంత్రి అమర్నాథ్


ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి చిరుధాన్యాలతో తయారుచేసిన చిత్రపటాన్ని  పరిశ్రమ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మంగళవారం బహుకరించారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతమైన సందర్భంగా సీఎం జగన్ ను మంత్రి గుడివాడ అమర్నాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విశాఖ నగరానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ సిరిధాన్యాలతో తయారుచేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటాన్ని మంత్రి అమర్నాథ్ సీఎంకు అందించారు.  అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా 2023ను యూఎన్ఓ  ప్రకటించిందని దీన్ని పురస్కరించుకొని తీర్చిదిద్దిన ఈ చిత్రపటాన్ని ముఖ్యమంత్రి ఎంతో ఆసక్తిగా తిలకించి ప్రత్యేకతలను తెలుసుకున్నారని మంత్రి తెలిపారు.  


ఏపీ ఆర్థికంగా ముందడుగు 


గత మూడున్నరేళ్లలో ఏపీ ఆర్థికంగా ముందడుగు వేస్తోందన్నారు సీఎం జగన్. కీలక సమంయోల ఈ సమ్మిట్ నిర్వహించామన్నారు. ఏపీని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. 15 కీలక రంగాల్లో ఫలవంతమైన చర్యలు జరిగాయని పేర్కొన్నారు. కరోనా సమయంలో ప్రభుత్వం పథకాలు ప్రజలకు అండగా నిలిచిందన్నారు. ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులేస్తోందని వివరించారు. రెండు రోజుల సమ్మిట్‌లో 378 ఎంవోయూలు జరిగాయని వివరించారు సీఎం జగన్. మొత్తం 13 లక్షల 41వేల 734 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు ఆసక్తి చూపినట్టు పేర్కొన్నారు. దీని వల్ల 6 లక్షల 9వేల 868 మందికి ఉపాధి లభించనుందన్నారు. 


ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు భారీ స్పందన 


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2023కి పరిశ్రమల నుంచి భారీ స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి  ప్రపంచస్థాయి సంస్థలు తరలి వచ్చాయి. రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు తీసుకొచ్చాయి. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ అనంతరం ప్రసంగం చేసిన సీఎం జగన్.. “అపారమైన సానుకూల దృక్పథంలో ప్రారంభించిన సమిట్‌లో  రూ. 13,41,734 కోట్లకుపైగా పెట్టుబడు పెట్టేందుకు 6,09,868 మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు 378 MOUలు చేసుకున్నాం. ఒక్క ఎనర్జీ సెక్టార్‌లోనే 1,90,268 మందికి ఉపాధి కల్పించే రూ.8,84,823 కోట్ల పెట్టుబడులకు 40 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఐటీ అండ్‌ ఐటీఈఎస్‌ సెక్టార్‌లో రూ. 25,587 కోట్ల పెట్టుబడితో 56 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఇవి 1,04,442 మందికి ఉపాధిని కల్పిస్తాయి. పర్యాటక రంగంలో 30,787 మందికి ఉపాధి కల్పించే రూ. 22,096 కోట్ల పెట్టుబడుల కోసం 117 అవగాహన ఒప్పందాలు కుదిరాయి." అని తెలిపారు.