CM Jagan : ఇటీవల నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన ఖరారై అర్థాంతరంగా ఆగిపోయింది. ఆగస్టు 30న సీఎం జగన్ నెల్లూరు జిల్లాకు వస్తారని, నెల్లూరు బ్యారేజ్, సంగం బ్యారేజ్ ప్రారంభిస్తారని అనుకున్నారు. కానీ చివరి నిముషంలో ఆ పర్యటన వాయిదా పడింది. సెప్టెంబర్ మొదటి వారంలో సీఎం జగన్ వస్తారని అంటున్నారు. సెప్టెంబర్ 4న సీఎం పర్యటన ఖరారైందని, అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందని అంటున్నారు. 


ఎందుకీ మార్పు?


సీఎం జగన్ పర్యటన వాయిదా పడటానికి ప్రధాన కారణం సంగం బ్యారేజ్ వర్క్స్ పూర్తి కాకపోవడమేనంటున్నారు. ఇటీవల సంగం బ్యారేజ్, పెన్నా బ్యారేజ్ పనులను మంత్రులు, జిల్లా కలెక్టర్ కూడా పరిశీలించారు. దాదాపు పనులు పూర్తవుతున్నాయని సీఎం రావడమే ఆలస్యం అనుకున్నారు. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి కూడా సీఎం జగన్ ని కలసి సంగం బ్యారేజ్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. ఆ తర్వాతే సీఎం పర్యటన 30న ఖాయమైందంటూ అధికారిక ప్రకటన విడుదలైంది.



ఆ తర్వాత నెల్లూరు బ్యారేజ్ పనులను మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పర్యవేక్షించారు. సీఎం జగన్ ఈనెల 30న జిల్లాకు వస్తారని అన్నారు. కానీ సంగం బ్యారేజ్ పనులు పూర్తికాకపోవడంతో పర్యటన వాయిదా పడింది. ఇప్పటికే ప్రారంభోత్సవాలు జీవితకాలం లేటు అని స్థానిక నేతలు అంటున్నారు. 2006లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పునాది రాళ్లు వేయగా 16 ఏళ్లుగా ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. వైసీపీ హయాంలో ఇప్పటికే ఐదారు మహూర్తాలు దాటిపోయాయి. చివరాఖరిగా పెట్టిన మహూర్తం కూడా దాటిపోవడంతో జగన్ ఇటు అధికారులకు, అటు నేతలకు క్లాస్ తీసుకున్నారని సమాచారం. ప్రాజెక్ట్ లు పనులు పూర్తయిన తర్వాతే ప్రారంభోత్సవం పెట్టుకోండని చెప్పారట. అందుకే సీఎం నెల్లూరు జిల్లా పర్యటన వాయిదా పడిందని అంటున్నారు. 




చవితి సెంటిమెంట్ ఉందా?


వినాయక చవితికి ముందు ప్రాజెక్ట్ ల ప్రారంభోత్సవం చేపట్టడం కంటే.. చవితి వెళ్లిపోయిన తర్వాత ఆ రెండు ప్రాజెక్ట్ లను ప్రారంభిస్తే బాగుంటుందనే సెంటిమెంట్ కూడా ఉంది. దీంతో ఈ ప్రారంభోత్సవాలను వారం రోజులపాటు వాయిదా వేశారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తమ్మీద జగన్ పర్యటన ఖరారైందని అధికారిక ప్రకటన విడుదలైన తర్వాత అది వాయిదా పడటం మాత్రం విశేషమే.  


సంగం, పెన్నా బ్యారేజీలు


నెల్లూరు జిల్లాకు సంగం బ్యారేజ్, పెన్నా బ్యారేజ్ రెండూ కీలకమైనవే. నెల్లూరు బ్యారేజ్ అందుబాటులోకి వస్తే నీటి నిల్వతోపాటు, పెన్నాకు వరద ముంచుకు వస్తే ముంపు ముప్పుని కొన్ని గంటలపాటు వాయిదా వేయొచ్చు. అదే సమయంలో నీరు సముద్రంపాలు కాకుండా ఆపి భూగర్భ జల మట్టం పెరిగేందుకు దోహదపడుతుంది. నెల్లూరు నగరంలో ట్రాఫిక్ సమస్యకు కూడా పరిష్కారం లభించినట్టవుతుంది. అటు సంగం బ్యారేజ్ అందుబాటులోకి వస్తే కావలి వరకు నీటిని సమృద్ధిగా అందుబాటులోకి తేవచ్చు. రవాణా సౌకర్యం మెరుగవుతుంది. బహుళ ప్రయోజనాలు ఉన్న ఈ బ్యారేజ్ లు వైసీపీ హయాంలో ప్రారంభోత్సవాలకు సిద్ధమవడం ఒకరకంగా పార్టీకి కూడా ప్రయోజనమే. అయితే అప్పుడు ఇప్పుడు అంటూ సగం సగం పనులు చేయడం, పలుమార్లు సమయాన్ని పొడిగించడంతో సీఎం జగన్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ మొదటి వారంలో మాత్రం జగన్ పర్యటన ఖాయం అంటున్నారు నేతలు. అధికారులు కూడా దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. 


Also Read : జగన్‌కు పవన్‌పై ఉన్న ఇంట్రెస్ట్‌ జనాలపై ఉంటే బాగున్ను: రామకృష్ణ