AP News : కేంద్ర కుటుంబ ఆరోగ్యశాఖ స‌హాయ‌ మంత్రి భారతి పవర్ సోమవారం ఏపీలో ప‌ర్యటించారు. కృష్ణాజిల్లాలో నిర్వహించిన‌ పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. అనంతరం స్పందన కార్యక్రమానికి హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. మచిలీపట్నంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాల పనులను ఈ సందర్భంగా ఆమె పరిశీలించారు. అనంతరం నిమ్మకూరులో నిర్మాణంలో ఉన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పనులను కేంద్రమంత్రి భారతి పవార్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.


డిసెంబ‌ర్ లో పేద‌ల‌కు ఇళ్లు 


కృష్ణా జిల్లాలో కేంద్ర పథకాల అమలుపై సమీక్ష చేశామ‌ని కేంద్ర మంత్రి భారతి పవర్ తెలిపారు. టిడ్కో ఇళ్లను సందర్శించి అక్కడ మౌలిక వసతులు పరిశీలించిన‌ట్లు భార‌తి ప‌వ‌ర్ తెలిపారు. అంతే కాదు 8600 ఇళ్లు నిర్మాణం చేయగా పనులు చివరి దశలో ఉన్నాయని, అక్కడ మౌలిక వసతులు కల్పించాల్సి ఉందని తెలిపారు. డిసెంబర్ లో పేదలకు ఫ్లాట్లు అప్పగిస్తామని అధికారులు చెప్పారని, అవ‌స‌రం అయితే ప‌నుల‌ను మ‌రింత వేగ‌వంతం చేయాల‌ని ఆదేశించామ‌ని అన్నారు. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రోగులకు అందించే వైద్య సేవలను తనిఖీ చేశామ‌ని, 64 రకాల టెస్ట్ లు ఉచితంగా, 350 రకాల మందులు ఉచితంగా ఇస్తున్నారన్నారు.  కేంద్రం ప్రాయోజిత ప్రాజెక్టు పనులు అరవై శాతం పూర్తి అయ్యాయన్నారు. రేషన్ పంపిణీ విషయంలో ప్రజల నుంచి కొన్ని ఫిర్యాదులు అందిన‌ట్లు వెల్లడించారు. ఒక్కో మనిషికి ఐదు కిలోలు కన్నా తక్కువ ఇస్తున్నారని, ఉచిత రేషన్ బియ్యం అందరికీ అందడం లేదననే ఫిర్యాదులు త‌మ దృష్టికి వ‌చ్చాయ‌ని తెలిపారు. దీని పై అధికారుల‌ను వివ‌ర‌ణ కోరామన్నారు.  


ఆయుష్మాన్ భారత్ పేరు మార్చి ఆరోగ్య శ్రీ 


ప్రధాన మంత్రి ఆవాస్ యోజన స్కీం కొన్ని చోట్ల ఆశించిన స్థాయిలో అమలు కావడం లేదని కేంద్రమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మంచి సేవలు అందుతున్నాయని, మెరుగైన సౌకర్యాలు కోసం కేంద్రం నిధులు మంజూరు చేస్తుందన్నారు. కొత్త మెడికల్ కళాశాలలను ఏపీకి మంజూరు చేశామ‌ని వివ‌రించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు నిధులు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం స్థలాలను సేకరించాల్సి ఉందన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు కేంద్రంమంత్రి భారతి పవర్ తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని పేరు మార్చి ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. అయితే ఏపీ వ్యవ‌హ‌రాల్లో రాజ‌కీయాల‌ను గురించి మాట్లాడేందుకు తాను ప‌ర్యటించ‌లేద‌ని కేంద్ర కుటుంబ ఆరోగ్య శాఖ స‌హాయ‌ మంత్రి భారతి పవర్ వ్యాఖ్యానించారు.


ఏపీలో రెండు రోజుల పాటు ప‌ర్యట‌న‌ 


ఈనెల 11, 12 తేదీలలో కేంద్ర మంత్రి భారతీ పవార్ మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో  నిర్వహించే  కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పటికే మొద‌టి ద‌ఫా ప‌ర్యట‌న‌ను పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు రెండో ద‌ఫా కూడా ప‌ర్యట‌న పూర్తయ్యింది. రెండు సార్లు ప‌ర్యట‌న సంద‌ర్భంగా చోటు చేసుకున్న ప‌రిణామాలు, వాటి ప‌ర్యావ‌సానం ఎలా ఉండ‌బోతోంది అనే అంశాల‌తో పాటు పార్టీ విష‌యాలను నాయ‌కుల నుంచి అడిగి తెలుసుకున్నారు. 


కేంద్ర మంత్రి ప‌ర్యట‌న‌లో దూరంగా సోము వీర్రాజు 


కేంద్ర మంత్రి రెండు రోజుల పాటు ఏపీలో ప‌ర్యటించారు. అయితే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం కేంద్ర మంత్రి ప‌ర్యట‌న‌కు దూరంగా ఉన్నారు.  సినీ న‌టుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు మ‌ర‌ణంతో ఆయన‌కు నివాళులర్పించేందుకు పార్టీ రాష్ట్ర నాయ‌క‌త్వం అంతా  హైద‌రాబాద్ వెళ్లారు. పార్టీ త‌ర‌పున కృష్ణంరాజు మృత‌దేహంపై జెండాను క‌ప్పి నివాళుల‌ర్పించారు. 


Also Read : CM Jagan: ప్రభుత్వ స్కూళ్లలో సమస్యలుంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయొచ్చు - సీఎం జగన్‌ రివ్యూ