APSRTC Special Buses : సంక్రాంతి సొంతూళ్లకు వెళ్లే వారికి ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పండగకు 6400 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ తిరుమలరావు ప్రకటించారు. జనవరి 6 నుంచి 18 వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు. అయితే పండగ స్పెషల్ బస్సుల్లో సాధారణ ఛార్జీలు అమలుచేస్తున్నట్లు తెలిపారు. ఈ సర్వీసులకు రిజర్వేషన్‌ సదుపాయం కల్పిస్తున్నామని ఆర్టీసీ ఎండీ  తిరుమలరావు చెప్పారు. ఒకేసారి రానూపోనూ టికెట్లు బుక్‌ చేసుకుంటే 10 శాతం రాయితీ ఇస్తామని తెలిపారు. 


ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆలోచన లేదు 


 ఏపీఎస్ఆర్టీసీ ఎండీ తిరుమలరావు విజయవాడలో మీడియాతో మాట్లాడారు. కొత్తగా 62 స్టార్‌లైనర్‌ నాన్‌ ఏసీ స్లీపర్‌ బస్సులు ప్రవేశపెట్టామని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి నాటికి కార్గో ద్వారా రూ.165 కోట్ల ఆదాయం లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. డిసెంబర్ చివరకు ఆర్టీసీ బస్సుల్లో టిమ్‌ మిషన్లు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడం లేదని ఎండీ స్పష్టం చేశారు. అలాగే ఆర్టీసీ ప్రైవేటీకరణ చేసే ఆలోచన లేదన్నారు. ఆర్టీసీ స్థలాన్ని వైసీపీ ఆఫీసుకు కేటాయించినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అయితే గతంలో ఆ స్థలాన్ని ఆర్టీసీకి ఏపీఐఐసీ కేటాయించిన తెలిపారు. ఆర్టీసీ ఆస్తులు కాపాడుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. స్థలం కేటాయింపు విషయంపై తమ నిరసన తెలిపామన్నారు. ఉద్యోగులు అలవెన్సులపై కంగారు పడొద్దన్నారు. ఉద్యోగుల ఓటీలు, అలవెన్సులు ఇస్తున్నామని ద్వారకా తిరుమలరావు చెప్పారు.


టీఎస్ఆర్టీసీ 4233 స్పెషల్ బస్సులు 


సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం టీఎస్ఆర్టీసీ (TSRTC) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 4,233 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది జనవరి 7 నుంచి 15వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులను తెలంగాణ ఆర్టీసీ నడపనుంది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ (TSRTC) ట్వీట్ చేసింది.  మొత్తం 4,233 స్పెషల్ బస్సు సర్వీసుల్లో 585 బస్సులకు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించాలని నిర్ణయించినట్లుగా ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. తెలంగాణలోని వివిధ పట్టణాలకే కాకుండా ఏపీలో డిమాండ్ ఉన్న ప్రాంతాలకు కూడా ఈ బస్సులు నడుస్తాయని చెప్పారు. గతేడాది సంక్రాంతికి 3,736 ప్రత్యేక బస్సులు నడిపామని ఎండీ సజ్జనార్ అన్నారు. ఈసారి వాటికి అదనంగా పది శాతం బస్సులను పెంచామని చెప్పారు. 


ఏపీకి ప్రత్యేక బస్సులు 


‘‘జనవరి 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురానికి 125, కాకినాడకు 117, కందుకూరు 83, విశాఖపట్నం 65, పోలవరం 51, రాజమండ్రికి 40 చొప్పున స్పెషల్ బస్సులు నడుపుతాం. వీటితోపాటు తెలంగాణలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలకు కూడా ఈ స్పెషల్ బస్సులు తిరగనున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం 60 రోజుల ముందుగానే టికెట్‌ రిజర్వేషన్‌ సదుపాయం కల్పిస్తున్నాం. గతంలో 30 రోజుల ముందు వరకూ మాత్రమే ఈ సౌకర్యం ఉండేది. వచ్చే ఏడాది జూన్‌ నెలాఖరు వరకు ఈ రిజర్వేషన్‌ సదుపాయం అందుబాటులో ఉంటుంది"అని వీసీ సజ్జనార్‌ చెప్పారు.