CID Notices To Narayana : అమరావతి రాజధాని భూముల కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణకు సీఐడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. నారాయణకు 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీచేసింది. మార్చి 6న సీఐడీ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. నారాయణతో పాటు ఆయన భార్య రమాదేవితో పాటు నారాయణ సంస్థలో ఉద్యోగి ప్రమీల, రామకృష్ణ హౌసింగ్‌ ఎండీ అంజనీకుమార్‌, నారాయణ కుమార్తెలు సింధూర, శరణి, అల్లుళ్లు పునీత్‌, వరుణ్‌కు కూడా సీఐడీ నోటీసులు ఇచ్చింది. మార్చి 7న లేదా 8వ తేదీన విచారణకు రావాలని నారాయణ కుమార్తెలకు నోటీసులు ఇచ్చింది ఏపీ సీఐడీ.


నారాయణ కుటుంబ సభ్యుల ఇళ్లలో సోదాలు


రాజధాని భూముల వ్యవహారంలో ఏపీ సీఐడీ  హైదరాబాద్ లో సోదాలు నిర్వహిస్తుంది. రాజధాని మాస్టర్ ప్లాన్ అవకతవకల విషయంలో సోదాలు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కూకట్‌పల్లి, గచ్చిబౌలి, కొండాపూర్‌లో ఉన్న నారాయణ కుటుంబ సభ్యుల ఇళ్లలో సీఐడీ సోదాలు చేస్తుంది. ఇప్పటి వరకు మాజీ మంత్రి నారాయణపై ఏపీ సీఐడీ అధికారులు పలు కేసులు పెట్టారు. పదోతరగతి పరీక్షాపత్రం లీకేజీతో పాటు, రాజధాని భూములకు సంబంధించి కేసులు నమోదు చేసింది సీఐడీ.


నారాయణ కుమార్తె ఇంట్లో సోదాలు


అమరావతి భూముల కేసులో సీఐడి మరోసారి విచారణ వేగవంతం చేసింది. మాజీ మంత్రి నారాయణ కుమార్తె ఇంట్లో సోదాలు చేస్తోంది. హైదరాబాద్‌లోని నివాసం ఉంటున్న ఆమె ఇంట్లో సీఐడీ అధికారులు ఇటీవల తనిఖీలు చేశారు.  ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని ప్రకటించడంతో అప్పటి మంత్రిగా ఉన్న నారాయణ అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ ప్రభుత్వం అనుమానిస్తోంది. అందుకే సీఐడీ విచారణ చేస్తోంది. విచారణలో భాగంగా సీఐడీ అధికారులు గతంలోనే నారాయణతోపాటు పలువురు ఇళ్లలో తనిఖీలు చేశారు ఇప్పుడు నారాయణ కుమార్తె ఇంట్లో తనిఖీలు చేశారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, కొండాపూర్‌, గచ్చిబౌలిలో ఉన్న ఆమె ఇళ్లలో సోదాలు చేస్తున్నారు అధికారులు. అమరావతి భూముల కేసులో కీలక మలుపు తిరిగే ఛాన్స్ ఉన్నట్టు కనిపిస్తోంది. నారాయణ కుమార్తె ఇంట్లో సోదాలు చేసిన సీఐడీ అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. నారాయణ, తన కుమార్తెతో మాట్లాడిన ఆడియో క్లిప్‌ లభించినట్టు తెలుస్తోంది. దీని ఆధారంగా కేసును ముందుకు తీసుకెళ్లాలని సీఐడీ భావిస్తోంది.  


చంద్రబాబు, నారాయణపై కేసులు 


అమరావతిలో అసైన్డ్ ల్యాండ్స్ అమ్మకాలు , కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ 2020లో సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబు, నారాయణ పేర్లను కూడా చేర్చారు. ఆ కేసుపై తాజాగా గతేడాది ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. రాజధాని అసైన్డ్‌భూముల వ్యవహారంలో వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి  ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ పోలీసులు చంద్రబాఋ, నారాయణలపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంతోపాటు ఏపీ అసైన్డ్‌ భూముల చట్టం, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.  ద‌ర్యాప్తున‌కు రావాలంటూ నోటీసులు అంద‌జేశారు. దీనిపై కోర్టు స్టే ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ చ‌ట్టం కింద కేసు న‌మోదు చేయాలంటే ద‌ళితులే ఫిర్యాదు చేయాలి. కానీ థ‌ర్డ్ పార్టీ కింద కేసు న‌మోదు చేశారు. అప్పుడే ఈ అంశంపై దుమారం రేగింది.