Maha Padayatra: అమరావతి ఏకైక రాజధాని నినాదంతో రైతులు చేపడుతున్న మలివిడత మహా పాదయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి నుంచి ప్రారంభమైయ్యే ఈ యాత్రకు అడ్డంకులెన్ని వచ్చినా, యాత్రను ముగించే లక్ష్యంతో రైతులు సిద్ధమవుతున్నారు. అమరావతి ఆవశ్యకతను ప్రజలందరికీ వివరించి మద్దతు కూడగడతామని ఐకాస నేతలు, రైతులు చెబుతున్నారు.
వెంకటపాలెం నుంచి ప్రారంభం
గుంటూరు జిల్లా వెంకటపాలెంలో రేపు అమరావతి మహాపాదయాత్ర ప్రారంభం కానుంది. నవంబర్ 11న శ్రీకాకుళం జిల్లా అరసవెల్లికి చేరుకోవటంతో పాదయాత్ర ముగుస్తుంది. ఆరోజు అక్కడ రైతులు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అమరావతిపై జరుగుతున్న కుట్రను ప్రజలకు వివరిస్తామని రైతులు చెప్పారు. రాజధానిని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను అందరికీ తెలియజేస్తామని వివరించారు.
12 పార్లమెంట్, 45 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా యాత్ర
12 పార్లమెంట్, 45 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా రైతుల మహాపాదయాత్ర సాగనుంది. ఆ దారిలో వచ్చే మోపిదేవి, ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం పుణ్యక్షేత్రాలను దర్శించుకోనున్నారు. ఈసారి జాతీయ రహదారుల వెంట కాకుండా.. పల్లెలు, పట్టణాలలో నడిచే విధంగా రూట్ మ్యాప్ రూపొందించుకున్నామని తెలిపారు. యాత్రకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వివిధ కమిటీలు సమన్వయం చేసేలా ప్రణాళిక తయారు చేశారు.
రైతులకు సంఘీభావం తెలపనున్న నారా లోకేష్
సోమవారం వెంకటపాలెంలో మొదలయ్యే యాత్ర.. కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం మీదుగా మంగళగిరికి చేరుకోనుంది. కృష్ణాయపాలెం వద్ద తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యాత్రలో పాల్గొని సంఘీభావం తెలుపనున్నారు. ప్రభుత్వం చెబుతున్నట్లు రాజధాని అమరావతి 29 గ్రామాలకే పరిమితం కాదని.. రాష్ట్ర ప్రజలందరి సొత్తు అని ఐకాస నాయకులు, రైతులు స్పష్టం చేశారు. అమరావతిపై వచ్చే ఆదాయాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి వినియోగించాలని తాము కోరుతున్నట్లు తెలిపారు. దీనిపై విషప్రచారం చేయడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు.
మున్సిపాలిటీ ఏర్పాటుపై రాజధాని గ్రామాల్లో ప్రభుత్వం గ్రామసభలు
ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని అమరావతి రైతులు తెలిపారు. రాజధానిగా అమరావతిని ఉంచాలని తాము కోరుతున్నామని.. ఇతర ప్రాంతాల అభివృద్ధికి వ్యతిరేకం కాదని స్పష్టంచేశారు. తమ పాదయాత్రకు మద్దతు తెలపాలని అన్ని రాజకీయ పక్షాలను, ప్రజలను అమరావతి రైతులు కోరారు. అయితే పాదయాత్ర ప్రారంభమవుతున్న సమయంలో అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటుపై రాజధాని గ్రామాల్లో ప్రభుత్వం గ్రామసభలు నిర్వహించనుంది. ఈ చర్యను రైతులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.
1000 రోజుల అలుపెరుగని పోరాటం
అమరావతి రైతులు ఉద్యమం ప్రారంభించి వెయ్యి రోజులవుతోంది. దక్షిణాఫ్రికాలో మూడు రాజధానులున్నాయని.. ఏపీకీ అవసరమేనని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించినప్పటి నుండి రైతులు ఉద్యమం ప్రారంభించారు. మూడు రాజధానుల ప్రకటన పాతికవేల మంది భూములిచ్చిన రైతుల గుండెల్లో అణుబాంబులా పడింది అప్పట్నుంచి ఆ రైతులు పడాల్సిన కష్టాలన్నీ పడ్డారు. కులం ముద్ర వేశారు. పెయిడ్ ఆర్టిస్టులన్నారు. కేసులు పెట్టారు. లాఠీలతో కుళ్లబొడిచారు. అయినా వారు ఉద్యమం చేస్తూనే ఉన్నారు. చివరికి న్యాయపోరాటం చేసి అనుకూల తీర్పు తెచ్చుకున్నారు. కానీ ఇప్పటికీ వారికి ఊరట లేదు. ఎందుకంటే ప్రభుత్వం హైకోర్టు తీర్పును శిరసావహించడానికి సిద్ధంగా లేదు