Andhra Pradesh News : గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. కొద్ది నెలల కిందట గ్రామ/వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు బదిలీలు పెద్ద ఎత్తున సాగాయి. ఈ బదిలీల్లో భాగంగా కొన్ని సచివాలయాల్లో ఎక్కువ మంది సిబ్బంది, మరికొన్ని సచివాలయాల్లో తక్కువ మంది సిబ్బంది పనిచేస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే గ్రామ/వార్డు సచివాలయాల్లో కనీసం ఎనిమిది మంది ఉద్యోగులు తప్పనిసరిగా పనిచేసేలా ప్రభుత్వం రేషనలైజేషన్ కు సిద్ధమైంది. పది రోజుల కిందట ఈ మేరకు విధివిధానాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. తాజాగా జిల్లాల్లో సర్దుబాటుకు సంబంధించిన తేదీలు వారీగా షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ మేరకు సచివాలయాల శాఖ డైరెక్టర్ ధ్యాన్ చంద్ర మెమో ఉత్తర్వులు జారీ చేశారు.
సర్దుబాటు ప్రక్రియ సాగేది ఇలా
గ్రామ/వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ఈనెల 22వ తేదీ నాటికి ఎనిమిది మంది కన్నా తక్కువ, ఎక్కువమంది పనిచేస్తున్న సచివాలయాల వివరాలతో అధికారులు నివేదికలు రూపొందించనున్నారు. ఈనెల 24న 8 మంది కంటే తక్కువ ఉద్యోగులు పనిచేస్తున్న సచివాలయాల్లో ఏ కేటగిరి ఉద్యోగ స్థానాలు ఖాళీగా ఉన్నాయో గుర్తిస్తారు. ఆ పోస్టుల భర్తీకి ఇప్పటికే సచివాలయాల ఉద్యోగుల రేసనలైజేషన్ ప్రక్రియ కోసం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్న నిబంధనలు ప్రకారం ఎక్కువ మంది ఉద్యోగులు పని చేస్తున్న సచివాలయాల నుంచి సర్దుబాటుకు ఎవరెవరిని ఒకచోట నుంచి మరోచోటకు బదలాయించే ఉద్యోగుల జిల్లాల వారీగా జాబితాను సిద్ధం చేస్తారు.
ప్రతి సచివాలయంలో కనీసం ఎనిమిది మంది పని చేసే అవకాశం ఉన్నంత వరకు అవసరమైన ఉద్యోగులకు పరిమితై ఆయా జాబితాను జిల్లా అధికారులు సిద్ధం చేస్తారు. సర్దుబాటు ప్రక్రియ కోసం జిల్లాల వారీగా ఎంపిక చేసిన ఉద్యోగులకు ఈ నెల 27, 28, 29 తేదీల్లో సీనియారిటీ ప్రకారం కౌన్సిలింగ్ నిర్వహించి సర్దుబాటు ప్రక్రియలో పేర్కొన్న ఖాళీల ప్రకారం ఆ ఉద్యోగులకు నచ్చిన సచివాలయానికి బదలాయించే ప్రక్రియను చేపడతారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 15,004 గ్రామ వార్డు సచివాలయాల్లో దాదాపు 1.34 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా ఈ సర్దుబాటు ప్రక్రియలో సుమారు 5000 మంది ఉద్యోగులు స్థాన చలనం కలిగే పరిస్థితి ఉంటుందని గ్రామ వార్డు సచివాలయాల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
సర్దుబాటు ప్రక్రియ చేపట్టే సమయంలో ఎక్కడైనా భార్యాభర్తలు వేరువేరు సచివాలయాల్లో పనిచేస్తుంటే వారి అభ్యర్థన మేరకు ఇరువురు ఒకేచోట బదిలీకి అవకాశం కల్పించనున్నారు. కేవలం భార్యా,భర్తల కోటాకే పరిమితమై కొనసాగే ఈ బదిలీలు జిల్లా పరిధిలో అంతర్గతంగాను, అదే సమయంలో ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు అవకాశం కల్పించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ బదిలీల కోసం ఉద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.