Adala's Reaction On Leaving YCP : నెల్లూరు ఎంపీ, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ రెండు రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టీడీపీ నాయకులతో చర్చలు పూర్తయ్యాయని, ఒకటి రెండు రోజుల్లో టీడీపీలో చేరడం ఖాయమంటూ ఊహాగానాలు వ్యాప్తి చెందాయి. ఈ వార్తలు, ఊహాగానాలకు చెక్‌ చెప్పారు ఆదాల ప్రభాకర్‌ రెడ్డి. తాను పార్టీ మారుతున్నానంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను వైసీపీలో కొనసాగుతున్నట్టు ఆదాల వెల్లడించారు.


దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపాటు          


పార్టీ మారుతున్నానంటూ గడిచిన ఏడాది కాలం నుంచి ప్రచారం చేస్తున్నారని, ఇదంతా అవాస్తవమని ఆదాల స్పష్టం చేశారు. ఈ మేరకు మీడియా సమావేశాన్ని బుధవారం ఏర్పాటు చేసిన ప్రచారాన్ని ఖండించారు. ఏడాది నుంచి పార్టీ మారడం లేదంటూ తాను చెబుతున్నానని, అయినా కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నట్టు పేర్కొన్నారు. సీఎం జగన్‌ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడి ననుంచి పోటీ చేస్తానని ఆదాల వివరించారు. అసెంబ్లీయా, పార్లమెంట్‌ బరిలోనా అన్నది అధినేతను కలిసి తరువాత క్లారిటీ ఇస్తానని ఆదాల ప్రభాకర్‌ రెడ్డి వెల్లడించారు.


వేమిరెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేశాను !                


పార్టీలో నెలకొన్న అసంతృప్త పరిణామాలపైనా ఆదాల ఈ సందర్భంగా స్పందించారు. అసంతృప్త నేతలను తాను స్వయంగా కలిసి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా చర్చలు ఫలించలేదన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డిని కలిసి నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్టు ఆదాల తెలిపారు. వేమిరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, మాగుంట మాత్రం కాస్త సానుకూలంగా స్పందించారని ఎంపీ ఆదాల మీడియా ముఖంగా వెల్లడించారు. తనపై వస్తున్న రూమర్స్‌ను ఎవరూ నమ్మవద్దని ఆయన వెల్లడించారు. కొంత మంది కావాలనే తనపై ప్రచారం చేస్తున్నారని, రోజూ మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకోలేనని స్పష్టం చేశారు.


నెల్లూరు వైసీపీలో వలసల కలకలం             


ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు  టీడీపీలో చేరిపోతున్నారు. గతంలోనే ముగ్గురు ఎమ్మెల్యేల టీడీపీ వైపు చేరగా..తాజాగా వైసీపీ ఎంపీ అభ్యర్థిగా నిర్ణయించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా టీడీపీలో చేరేందుకు  చంద్రబాబుతో సమావేశం అయ్యారని చెబుతున్నారు, ఇక ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీ మారుతారని ప్రచారం జరడంతో.. .  సీఎం జగన్ మరో పార్టీ నేత ఆనం విజయ్ కుమార్ రెడ్డిని రెడీ చేసుకున్నారు.  అయితే అదాల పై మాత్రం నమ్మకం పెట్టుకోలేకపోతున్నారు. గత ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో ఉండేవారు. టీడీపీ రూరల్ అభ్యర్థిగా ప్రచారం కూడా ప్రారంభించారు. కానీ ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు వచ్చిన తర్వాత ఆయన వైసీపీలో చేరిపోయి.. ఎంపీగా పోటీ చేశారు. ఈ సారి కూడా అలా చేస్తారేమోనని వైసీపీ నేతలు కంగారు పడుతున్నారు.