Actor Sonusood Gave Four Ambulances To CM Chandrababu: రియల్ హీరో సోనూసూద్ (Sonusood) ఏపీ ప్రభుత్వానికి 4 అంబులెన్సులు అందించారు. సోమవారం అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబును (CM Chandrababu) కలిసిన ఆయన.. 'సూద్ ఛారిటీ ఫౌండేషన్' తరఫున అంబులెన్సులను ఆయనకు అప్పగించారు. అనంతరం వీటిని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మర్యాదపూర్వకంగా తనను కలిసేందుకు వచ్చిన సోనూసూద్‌ను.. సీఎం చంద్రబాబు అభినందించారు. ప్రభుత్వానికి అంబులెన్సులు అప్పగించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రశంసించారు. ఆరోగ్య సంరక్షణలో మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని.. ఇందులో 'సూద్ ఛారిటీ పౌండేషన్' భాగస్వామ్యం అయినందుకు కృతజ్ఞతలు తెలిపారు.






'ఏపీ అంటే ప్రత్యేక ప్రేమ'


ఏపీ తనకు రెండో ఇల్లు లాంటిదని.. ఇక్కడి ప్రజల కారణంగానే తాను ఇంతటివాడిని అయ్యానంటూ సోనూసూద్ చెప్పారు. అందుకే ఆంధ్రా అంటే తనకు ప్రత్యేక ప్రేమ అని అన్నారు. నటుడిగా తనపై ప్రేమ చూపించిన తెలుగు ప్రజలందరికీ రియల్ హీరో ధన్యవాదాలు తెలిపారు. వైద్య సదుపాయాలు సరిగ్గా లేని ప్రాంతాల కోసం 4 అంబులెన్సులు ఇచ్చినట్లు చెప్పారు. వీటిని ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వానికి ఇచ్చామని పేర్కొన్నారు. ఈ అంబులెన్సులు ప్రజల ప్రాణాలు కాపాడడంలో ప్రభుత్వానికి ఉపయోగపడతాయని చెప్పారు. ప్రస్తుతం నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వీటిని ఉపయోగిస్తారని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. 'తెలుగు ప్రజలు నాకు అత్యంత ఆప్తులు. వారికి ఏదైనా చేయడం నా బాధ్యతగా భావిస్తాను. నా సతీమణి కూడా ఆంధ్రాకు చెందిన తెలుగువారే. కొవిడ్ సమయంలోనే ప్రజలను ఆదుకోవాలన్న ఆలోచనతో నా బాధ్యత మొదలైంది.


ఎవరికైనా ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉంటాను. సమాజానికి మేలు చేయాలన్న విషయంలో సీఎం చంద్రబాబు చాలామందికి స్ఫూర్తి. నాకు ఎలాంటి రాజకీయపరమైన ఆశలు లేవు. నేను ఓ సామాన్య వ్యక్తిని. ప్రజల మనిషిని. సమాజానికి తిరిగి ఇవ్వాలన్న తపనే నన్ను ఇలా నడిపిస్తోంది. కొవిడ్ సమయం నుంచీ సీఎం చంద్రబాబుతో టచ్‌లో ఉన్నా. వారి ఆశీర్వాదం ఇప్పుడు తీసుకున్నా. ప్రజలకు సహాయ కార్యక్రమాలు ఫౌండేషన్ ద్వారా ఎల్లప్పుడూ కొనసాగుతాయి.' అని సోనూసూద్ స్పష్టం చేశారు. త్వరలోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను సైతం కలుస్తానని అన్నారు. ఫతే సినిమా సీక్వెల్ కోసం పని చేస్తున్నట్లు చెప్పారు. టాలీవుడ్‌లో పని చేసేందుకు సిద్ధంగానే ఉన్నానని.. హీరో, విలన్ రోల్స్ మాత్రమే కాదని.. నటుడిగా ఏ రోల్ చేసేందుకైనా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.


Also Read: Ashwini Vaishnav: ఏపీకి రైల్వే శాఖ భారీ శుభవార్త - తెలుగు రాష్ట్రాల నుంచి మరిన్ని వందే భారత్ రైళ్లు, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన