Sonusood Helped Kurnool Girl Student: ప్రముఖ నటుడు సోనూసూద్ మరోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఓ పేద విద్యార్థిని చదువు కోసం ఆర్థిక సాయం అందించి అండగా నిలబడ్డారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బసవనూరుకు చెందిన దేవీకుమారి బీఎస్సీ చదవాలని కలలు కన్నారు. అయితే, ఇంటి ఆర్థిక పరిస్థితులు ఇందుకు సహకరించలేదు. ఈ క్రమంలో 'నా చదువుకు హెల్ప్ చేయండి సార్' అని వేడుకుంటూ ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. దీన్ని చూసిన నటుడు సోనూసూద్ వెంటనే స్పందించారు. 'నీ చదువును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దు. కాలేజీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉండు' అంటూ సదరు విద్యార్థినికి రిప్లై ఇచ్చారు.
ఆర్థిక సాయం.. పాలాభిషేకం
ఇచ్చిన మాట ప్రకారమే దేవీకుమారి చదువుకు కావాల్సిన సాయాన్ని సోనూసూద్ అందించారు. దీంతో ఆ విద్యార్థిని కుటుంబం ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ సందర్భంగా దేవీకుమారి సోనూసూద్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 'మా కుటుంబం ఆర్థికపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కానీ, నాకు చదువుపై చాలా ఆసక్తి ఉంది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చదువును మధ్యలోనే ఆపేయాలనుకున్నా. నా కలలన్నీ ఆవిరయ్యాయని ఆవేదన చెందాను. అలాంటి సమయంలో సోనూసూద్ సార్ నాకు అండగా నిలిచారు. ఆర్థిక సాయం అందించి భరోసా ఇచ్చారు. ఆయన నాకు దేవునితో సమానం.' అని ఆనందం వ్యక్తం చేశారు. సోనూసూద్‌కు పాలాభిషేకం చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఆయన్ను ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
స్పందించిన సోనూసూద్
ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన సోనూసూద్.. 'మీరు నాపై చూపించే ప్రేమాభిమానాలకు థ్యాంక్యూ. కాలేజీ అడ్మిషన్ తీసుకున్నాం. బాగా చదువుకోండి. ఈ ఆంధ్రా అమ్మాయి జీవితంలో ఉన్నత శిఖరాలు అందుకునేలా, ఆమె కుటుంబం గర్వపడేలా చేద్దాం. ఈ విషయంలో నాకు మార్గదర్శకంగా ఉన్న సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు' అంటూ సోనూసూద్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
కాగా, కరోనా సమయంలోనూ నటుడు సోనూసూద్ అందరికీ సాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకున్నారు. చాలామందిని ప్రత్యేక బస్సుల్లో వారి వారి స్వగ్రామాలకు తరలించడం సహా వారి బాగోగులు చూసుకున్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి సాయం అవసరమైన ఎంతోమందికి చేయూత అందించారు. చదువు, వైద్యం కోసం ఎంతోమందికి సాయం అందిస్తూ దేవుడయ్యారు.