AP Latest News: నటుడు, కమెడియన్ అలీ వైఎస్ఆర్ సీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేసి ప్రకటించారు. ఇకపై తాను ఏ పార్టీలోనూ ఉండబోనని, మరే పార్టీకి మద్దతు పలకబోనని స్పష్టత ఇచ్చారు. ఇక తాను నటుడిగానే కొనసాగుతానని వెల్లడించారు.


రామానాయుడు ప్రోత్సాహంతోనే తాను నటుడ్ని అయ్యానని, అలాంటి ఆయన కోసమే అప్పట్లో రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. రామానాయుడు ఎంపీగా పోటీ చేసిన సమయంలో తన కోసం ప్రచారం నిర్వహించమని కోరారని, ఆయన కోసం టీడీపీలో చేరి.. దాదాపు 20 ఏళ్లు అదే పార్టీలో ఉన్నానని అన్నారు.


తనకు అన్నం పెట్టింది తెలుగు సినిమా పరిశ్రమ అని.. నిర్మాతలు, నటులు, టెక్నీషియన్లే తనకు అన్నం పెట్టారని గుర్తు చేసుకున్నారు. తనకు దయా గుణం ఉన్నందున రాజకీయాలు తోడైతే పది మందికి సాయపడొచ్చనే ఉద్దేశంతో ఇటువైపు వచ్చాను కానీ, నిజంగా రాజకీయాలు చేద్దామని ఇందులోకి రాలేదని అన్నారు. సినీ పరిశ్రమ తనకు చాలా మంది జీవితం ఇచ్చిందని అన్నారు. 


‘‘మా నాన్నగారిపేరుపై ఓ ట్రస్టును 16 ఏళ్లుగా నడుపుతున్నాను. కొవిడ్ టైంలో కూడా నేను సాయం ఆపలేదు. ఎంతో మందిని చదివిస్తున్నాను. నా సంపాదనలో 20 పర్సెంట్‌ను ట్రస్ట్ కు ఇస్తున్నాను. విదేశాల్లో ఈవెంట్స్ చేసినా కూడా ఆ రెమ్యునరేషన్‌ నుంచి 60 శాతం సొమ్మును ట్రస్టుకు ఇచ్చేవాడిని. నేను వ్యక్తిగతంగా ఎవరినీ ఏమీ అనలేదు. వృత్తి పరంగానూ, రాజకీయాల్లో కూడా ఫలానా వ్యక్తిని లేదా రాజకీయ నాయకుడ్ని తప్పు మాట అనడం ఎక్కడా చేయలేదు. 


నేను ఏ పార్టీ మనిషిని కాను. ఏ పార్టీకి మద్దతు పలకడం లేదు. సామాన్య మనిషిని. ఇకపై పూర్తిగా సినిమాలు చేసుకుంటూనే ఉంటాను. సామాన్యుల తరహాలోనే ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికల్లో ఓటు వేయడానికి మాత్రమే వెళ్తాను. ఇకపై నాకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. ఈ మాట చెప్తామనే ఈ వీడియో విడుదల చేస్తున్నాను.’’ అని అలీ వీడియోను విడుదల చేశారు.