Remand For Ex Mining Director Venkat Reddy: గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డికి (Venkat Reddy) ఏసీబీ కోర్డు (ACB Court) రిమాండ్ విధించింది. అక్టోబర్ 10 వరకూ ఆయనకు రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెలువరించింది. గనుల లీజులో అక్రమాలు చేశారనే ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదైంది. ఈ నెల 11న ఆయనపై కేసు నమోదు చేసిన అధికారులు.. గురువారం రాత్రి హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. జేపీవీఎల్, జీసీకేసీ, ప్రతిమ సంస్థలకు వెంకటరెడ్డి అనుచిత లబ్ధి కలిగించారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించింది. కాగా, గత ఐదేళ్లుగా ఇసుక, ఖనిజ, గనుల శాఖలో వెంకటరెడ్డి మాటే శాసనంగా సాగిందని కూటమి ప్రభుత్వం ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తూ వచ్చింది. అధికారంలోకి రాగానే అక్రమాలపై ఫిర్యాదు చేసింది. విచారణ చేసేందుకు ఆయన కోసం మూడు నెలలుగా ఏసీబీ అధికారులు ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఆయన్ను అరెస్ట్ చేసి చర్యలు చేపట్టారు. 


ఇవీ ఆరోపణలు


గనుల శాఖలో టెండర్లు, అగ్రిమెంట్స్‌, ఏపీఎంఎంసీ రూల్స్‌ పాటించకుండా చర్యలు, ఇసుక తవ్వకాల్లో అవినీతి, అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలు వెంకటరెడ్డిపై ఉన్నాయి. ఈ ఆరోపణలతోనే ప్రభుత్వం ఇప్పటికే ఆయన్ను విధుల నుంచి సస్పెండ్ చేసింది. ఆ నోటీసులు ఇచ్చేందుకు అప్పటి నుంచి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన ఆచూకీ లభించలేదు. గురువారం రాత్రి వెంకటరెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. అంతకు ముందు ఆయన్ను రహస్య ప్రదేశంలో విచారించినట్లు సమాచారం. ఐదేళ్లలో ఇసుక విధానంతో రూ.2,566 కోట్లు దోచినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇసుక తవ్వకాల్లో ఇష్టారాజ్యంగా చేసినా పట్టించుకోలేదని ప్రభుత్వం ఆరోపిస్తోంది. బకాయిలు చెల్లించకుండానే కాంట్రాక్ట్ సంస్థల డిపాజిట్‌లను వెనక్కి ఇచ్చేశారని కూడా చెబుతున్నారు. వీటన్నింటిపైనా ఏసీబీ విచారణలో నిజాలు నిగ్గు తేలనున్నాయి.


Also Read: YS Jagan: 'రాష్ట్రంలో రాక్షస రాజ్యం' - తిరుమల లడ్డూ టాపిక్ డైవర్ట్ చేయడానికే డిక్లరేషన్ టాపిక్ తెచ్చారన్న జగన్, ప్రభుత్వ తీరుపై ఆగ్రహం