అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ( Gudivada Amarnath ) చేసిన వ్యాఖ్యలను తాను వేయబోయే పరువు నష్టం కేసులో పొందు పరుస్తానని సస్పెన్షన్‌లో ఉన్న ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ( AB Venkateswar Rao) ప్రకటించారు. గుడివాడ అమర్నాథ్ మంగళవారం అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడుతూ ఏబీ వెంకటేశ్వరరావుపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయన హోంగార్డుగా కూడా పనికి రారన్నారు. అలాగే ఆయన ఐపీఎస్ ( IPS ) కాదని ... ఇజ్రాయెలీ పెగాసస్ సర్వీసెస్ అని విమర్శించారు. ఆయన కుమారుడి కంపనీతో కలిసి అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. తనపై చేసిన ఆరోపణలన్నింటికీ ఆయన వద్ద ఆధారాలుంటే ప్రభుత్వానికి ఇవ్వవొచ్చని ..ప్రభుత్వం తనపై చర్యలు తీసుకోవచ్చని విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో ( Press Note ) పేర్కొన్నారు. అదే సమయంలో తనపై చేసిన వ్యాఖ్యలను తాను దాఖలు చేయబోయే పరువు నష్టం కేసులో పొందు పరుస్తానన్నారు. పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను తాము నిబంధనలకు లోబడి వినియోగిస్తున్నామని గుడివాడ అమర్నాథ్ చెప్పిన విషయం ఈనాడులో వచ్చిందని గుర్తు చేశారు .


వైఎస్ఆర్‌సీపీ ( YSRCP ) నేతలతో పాటు కొన్ని మీడియా సంస్థలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని వారందరిపై పరువు నష్టం కేసులు దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఏబీ వెంకటేశ్వరరావు దరఖాస్తు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన సర్వీసులో ఉన్నారు. ఆయనకు ఇంకా రెండేళ్ల సర్వీసు ఉంది. ఇలా ఉద్యోగి హోదాలో ఎవరిపైనైనా న్యాయపోరాటం చేయాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. అందుకే ఆయన సీఎస్ ( Chief Secratary ) పర్మిషన్ అడిగారు. అయితే ఆయనపై ఆరోపణలు చేస్తోంది వైఎస్ఆర్‌సీపీ నేతలు కావడంతో ప్రభుత్వం కూడా వారిదే కావడంతో ఆయనకు అనుమతి లభించడం కష్టమేనని భావిస్తున్నారు. అయితే తనపై ఇష్టం వచ్చినట్లుగా తప్పుడు ప్రచారాలు చేసి.. దాన్ని తప్పు అని చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వకపోవడం ఏమిటని ఏబీవీ ప్రశ్నిస్తున్నారు. 


ఏబీవీ వెంకటేశ్వరరావు గత ప్రభుత్వంలో ఇంటలిజెన్స్ చీఫ్‌గా ( Inteligence Chief )  పని చేశారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఆయనను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆ తర్వాత వైఎస్ఆర్‌సీపీ ప్రభత్వం అధికారంలోకి వచ్చింది.  కానీ ఏబీవీకి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. చాలా కాలం తర్వాత ఆయనపై కేసులు పెట్టి సస్పెండ్ చేసింది. ఇటీవల ఆయనను సర్వీస్ నుంటి టెర్మినేట్ చేయాలని కేంద్రానికి సిఫార్సు చేస్తూ లేఖ రాసింది. ఆయనపై ఏపీ ప్రభుత్వం నమోదు చేసిన కేసుల విచారణ ఇంకా సుప్రీంకోర్టులోనే పెండింగ్‌లో ఉంది.