Aarogyasri Network Hospitals: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలు బంద్ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ అసోసియేషన్‌ (ఆశా) నిర్ణయించింది. ఆరోగ్యశ్రీ పథకం కింద ఆస్పత్రులకు చెల్లించాల్సిన పెండింగ్‌ బిల్లులను ప్రభుత్వం ఇంకా చెల్లించకపోవడంతో ఆశా ఈ నిర్ణయం తీసుకుంది. దాదాపు రూ.1500 కోట్లు ప్రభుత్వం బకాయి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ బకాయిల చెల్లింపులపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ అధికారులు, ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ అసోసియేషన్‌ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు మంగళవారం విఫలమయ్యాయి. బుధవారం (మే 22) నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని గతంలోనే అసోసియేషన్‌ ప్రకటించింది. ఈ అసోసియేషన్ లో సభ్యత్వం కలిగిన ఆసుపత్రుల్లో రోగులకు చికిత్స అందించడాన్ని నిలిపివేయనున్నట్లు ఆశా యాక్టింగ్‌ ప్రెసిడెంట్‌ వై రమేష్, ప్రధాన కార్యదర్శి సి.అవినాష్‌ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. 


అలాగే ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్ కింద కొత్త కేసులను తీసుకోబోమని స్పష్టం చేశారు. నిన్న జరిగిన జూమ్ మీటింగ్‌లో ప్రభుత్వం బిల్లులు క్లియర్ చేస్తుందని సీఈవో లక్ష్మీశా చెప్పినప్పటికీ గతంలో కూడా ఇదే చెప్పారని అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. బకాయిలు చెల్లించకుంటే రోగులకు చికిత్స అందించడాన్ని నిలిపివేస్తామని ఆశా తేల్చి చెప్పింది.


ఏపీలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల అసోసియేషన్‌ సేవలు నిలిపేస్తున్నట్లుగా ట్రస్ట్‌ సీఈవోకి, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖను పంపారు. మే 22 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తున్నట్లుగా లేఖలో తెలిపారు. ఇప్పటికే ఆస్పత్రుల్లో ఉన్న వారికి మాత్రం వైద్య సేవలు కొనసాగిస్తామని అన్నారు. ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో కూడా ఆరోగ్య సేవలు నిలిపేస్తామని ప్రకటించారు. 


కరోనా సమయంలో అందించిన చికిత్స బిల్లులు, ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులు సుమారు మూడేళ్ల నుంచి ప్రభుత్వం చెల్లించడంలేదని ఆశా వెల్లడించింది. ఆ మొత్తం బకాయిలు చెల్లించే వరకూ ఆరోగ్యశ్రీ సేవలు అందించేది లేదని వారు తేల్చి చెప్పారు.