Andhra News :   మానవ అక్రమ రవాణా- వాలంటరీ వ్యవస్ధ ఈ రెండింటికీ ముడిపెట్టడం అంటే మోకాలికి బోడి గుండుకి ముడిపెట్టడం లాంటిదేనని ఏపి ఇంటిలెక్చువల్ సిటిజన్స్ ఫోరమ్ , రాష్ట్ర అధ్యక్షుడు, అధికార భాషా సంఘం అధ్యక్షుడు  విజయ్ బాబు అన్నారు.   ఏపి ఇంటిలెక్చువల్స్ సిటిజన్స్ ఫోరమ్ ఆద్వర్యంలో మానవ అక్రమ రవాణా- గ్రామ వాలంటీర్ల వ్యవస్ధ పై రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవాడలో నిర్వహించారు. ఈ సందర్బంగా  విజయబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకి వాస్తవాలు తెలియజేసే ఉద్దేశంతోనే ఇంటిలెక్చువల్ సిటిజబ్స్ ఫోరమ్ ఉందన్నారు.  మానవ అక్రమ రవాణాలో వాలంటీర్ల వ్యవస్ధ అనే ఆరోపణలు రావడంతో ఈ అంశం పై ప్రజలకు వాస్తవాలు తెలియచేయాలనే ఉద్దేశంతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతున్నామని చెప్పారు. 


మన భావన బట్టే మన దృష్టి ఉంటుందని, వాలంటీర్ల వ్యవస్ధ ద్వారా మానవ అక్రమ రవాణా సాధ్యమేనా అనే విషయాలను ఆలోచించాలన్నారు.   మానవ అక్రమ రవాణా వ్యవహరం ఇప్పుడు పుట్టింది కాదని,  దేశంలో మానవ అక్రమ రవాణాకు పేదరికం కూడా ఒక కారణమని అధికార భాషా సంఘం అధ్యక్షుడు  విజయ్ బాబు అభివర్ణించారు. భారతదేశంలో ఎనిమిది మిలియన్ల అక్రమ రవాణా బాధితులు ఉన్నారని అధ్యయనాలు చెబుతున్నాయని,  ఈ విషయాలను  పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలని హితవు పలికారు. దుర్బర దారిద్రాలు, మానసిక కారణాలు కూడా ఒక‌ కారణమని సర్వేల్లో తేలిందన్నారు.  పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలలో ఎక్కువ అక్రమ‌ రవాణా జరుగుతుందని వివరించారు.


 ఏపి‌ కంటే తెలంగాణాలోనే అక్రమ‌ రవాణా ఎక్కువ అని వివరించారు. 2020 ఏప్రియల్ నుంచి 2021  ఏప్రియల్ వరకు 27 శాతం తెలంగాణా మానవ అక్రమ రవాణా ఎక్కువ గా ఉందని గణాంకాలు చెబుతున్నాయని అన్నారు.  తెలంగాణాలో  నివాసం ఉండే పవన్ కల్యాణ్ దాని పై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.  కేసిఆర్ మాడు పగులగొడతానిని‌ పవన్ కి భయం అని ఎద్దేవ చేశారు. డ్రగ్స్ కేసులలో  తెలంగాణా వార్తల్లోకి వస్తుంటే,  పవన్ కళ్యాణ్ కిక్కురనకుండా మౌనంగా ఉంటున్నారని,  జాతీయ, అంతర్జాతీయ సమస్య గా ఉన్న మానవ అక్రమ రవాణా పై పవన్ నానా యాగీ చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 


 ప్రజలలో ద్వేషం‌ కలిగించాలనే వాలంటీర్ల వ్యవస్ధ పై  తప్పుడు ఆరోపణలు చేయటం సరికాదని బెజవాడ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు  పిళ్ళా రవి అన్నారు.   కరోనా సమయంలో వాలంటీర్ల సేవలని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయనే విషయాన్ని గుర్తించాలని అన్నారు. వాలంటీర్ల వ్యవస్ధపై పిచ్చి వాగుడు వాగిన పవన్ కళ్యాణ్ వారాహి వాహనం‌ నుంచే వాలంటీర్లకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు చేసినందుకు ప్రభుత్వానికి క్షమాపణ కూడా చెప్పాలన్నారు.


ఇంటలెక్చువర్ ఫోరమ్ పేరుతో సభ ఏర్పాటు చేసినా పూర్తిగా రాజకీయ ప్రసంగాలకు.. పవన్ ను నిందించడానికే సమావేశంలో ప్రాధాన్యత ఇచ్చారు.అసలు సమస్యపై ఇంటలెక్చవల్స్ ఫోరమ్ సభ్యులు చర్చించలేకపోయారు.