Ramachandra Yadav:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. అవినీతి రహిత సుపరిపాలన అందించడమే లక్ష్యంగా కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రముఖ వ్యాపార వేత్త రామచంద్ర యాదవ్‌ ప్రకటించారు. జూలై 23వ తేదీన అంటే ఈ ఆదివారం  కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నారు.  గుంటూరు- విజయవాడ మధ్య నాగార్జున యూనివర్సిటీ ముందు ‘ప్రజా సింహగర్జన పార్టీ’ ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు . 
 
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వర్గాల్లోని వారి మద్దతుతోనే పార్టీ పెడుతున్నా : రామచంద్ర యాదవ్


రాష్ట్రాన్ని ఇప్పటి వరకు పరిపాలించిన పార్టీల వల్ల కేవలం 10 శాతం ప్రజలకే ప్రతిఫలం దక్కింది. మిగతా 90 శాతం ప్రజలు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగపడగలిగారని రామచంద్ర యాదవ్ అంటన్నారు.  పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆర్థిక, సామాజిక, రాజకీయ అస్థిరత ఏర్పడుతుంది. ప్రజా సంపద కొందరి చేతిలోనే బంధీ అవుతుంది. ఇప్పటికే దౌర్జన్యాలు, దందాలు, ప్రజా సంపద దోపిడీతో రాష్ట్రానికి, ప్రజలకు ఏ విధంగా నష్టం చేకూరుతోందో మన కళ్లెదుటే స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు.  ఈ పరిస్థితిని మార్చడానికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వర్గాల్లోని వారి మద్దతుతో జూలై 23న కొత్త పార్టీ ఆవిర్భవించబోతోందని రామచంద్రయాదవ్ చెబుతున్నారు. 


గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన రామచంద్ర యాదవ్ 


2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై నేను పోటీ చేశారు.  అప్పుడు నేను రాజకీయాలకు కొత్త. అప్పటి పరిస్థితులు వేరు. అందువల్ల ఓటమి చవిచూడాల్సి వచ్చిందని అంటున్నారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ, కొత్తగా ఎన్ని పార్టీలు వచ్చినప్పటికీ ధైర్యంగా ప్రజల కోసం ఎన్ని నిలబడ్డాయన్నదే ప్రధానం. వివిధ రకాల అజెండాలతో ఇప్పటి వరకు పలు పార్టీలు వచ్చి ఉండవచ్చు. పార్టీ నడపాలంటే కేవలం డబ్బు మాత్రమే ఉంటే సరిపోదు. ఓపిక, ధైర్యం, నిజాయితీ, ప్రజలకు మేలు చేయాలన్న తపన చాలా ముఖ్యం. వీటన్నింటితో పాటు కమిట్‌మెంట్‌ ఇంకా ప్రధానం. అవన్నీ తనకు ఉన్నాయని రామచంద్ర యాదవ్ చెబుతున్నారు.  అనంతపురం నుంచి అటు శ్రీకాకుళం వరకు పర్యటించాను. అన్ని వర్గాల ప్రముఖులు, సామాన్యులతో మమేకమయ్యాను. వారందరి సూచనలు, సలహాలు.. నా విజన్‌ను దృష్టిలో ఉంచుకుని కొత్త పార్టీ ఏర్పాటే సబబు అని నిర్ణయించుకుని ఆ దిశగా అడుగులు వేస్తున్నాను. మా పార్టీ విధానం ఏమిటనేది ఈ నెల 23వ తేదీన విస్పష్టంగా ప్రకటిస్తామని అంటున్నారు. 


రామచంద్ర యాదవ్ వెనుక ఉన్నదెవరన్నదానిపై చర్చ !


ఓ వ్యాపారవేత్త అయిన రామచంద్ర యాదవ్ .. నేరుగా అమిత్ షాను కలిసి తనకు వై ప్లస్ సెక్యూరిటీ తెచ్చుకోగలిగారు. ఆయన కొత్త ఇల్లు కట్టుకుంటే గృహప్రవేశానికి రామ్ దేవ్ బాబా సహా చాలా మంది ప్రముఖులు వస్తారు. దీంతో ఆయన కొత్త పార్టీ వెనుక ఎవరు ఉన్నారన్నదానిపై విస్తృత చర్చ జరుగుతోంది. ఆయన మాత్రం బడుగుల కోసమే పార్టీ పెడుతున్నానని చెబుతున్నారు.