A new alliance is getting ready to contest the AP elections :ఏపీలో ఎన్నికల వేడి పెరిగే కొద్దీ రాజకీయ పార్టీలు తమ కార్యకలాపాలను ఉద్ధృతం చేస్తున్నాయి. తాజాగా కమ్యూనిస్టులు, కాంగ్రెస్ లతో చేతులు కలిపేందుకు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మినారాయణ రెడీ అయ్యారు. ఈ పార్టీలన్నీ కలిపి విజయవాడలో వ్యూహాత్మక సమావేశం నిర్వహించాయి. ఈ దేశంలో ఐక్యతకు ప్రయత్నించినపుడల్లా, మతతత్వ శక్తులు విచ్ఛిన్నం చేస్తూనే ఉన్నాయని.. కానీ, ఈసారి ఏపీ ఒక అడుగు ముందుకేసి, మినీ ఇండియాకు శ్రీకారం చుడుతున్నామని ఆ పార్టీ నేతలు ప్రకటించారు.
కమ్యూనిస్టుల సదస్సుకు హాజరైన వీవీ లక్ష్మినారాయణ
విజయవాడలో వామపక్ష సదస్సులో వేదికపై జైభారత్ నేషనల్ పార్టీ అధినేత జేడీ లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ప్రత్యేక హోదా రాక, విభజన హామీలు నెరవేరక, అనాధలా మిగిలిన ఏపీ కోసం పదవిలో ఉన్నవారు పెదవి విప్పరు. ప్రతిపక్షంలో ఉన్నవారూ నోరు మెదపరని ఆయన విమర్శించారు. పెద్దలమని చెప్పుకొనే, అందరూ కేంద్ర బీజేపీ ఎదుట సాగిలపడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతి కోసం, హోదా, విభజన హామీల సాధన కోసం పోరాట పార్టీలు పోరుబాటలో చేయి చేయి కలిపి, మినీ ఇండియాకు శ్రీకారం చుడుతున్నాయని ప్రకటించారు.
జైభారత్ నేషనల్ పార్టీ చొరవ
ఏపీ నుంచి అధికారికంగా ఢిల్లీ వెళ్లిన నేతలు, పొత్తుల కోసం హస్తినకు పోయి పాకులాడుతున్ననేతలు రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తున్నారని అంటున్నారు. కుటిల, స్వార్ధ రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్న తరుణంలో ఎర్ర జెండాలతో కలిసి, రాష్ట్ర ఎజండాలను సాధించేందుకు జై భారత్ నేషనల్ పార్టీ ముందడుగు వేస్తోందని లక్ష్మినారాయణ ప్రకటించారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదని, విభజన హామీల సాధనకు ముందస్తుగా ఉద్యమించిన జై భారత్ నేషనల్ పార్టీ అధినేత వి.వి.లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.
కార్యాచరణ ఖరారుకు మరో సమావేశం
విపక్షాలతో కూడిన అఖిలపక్షం విజయవాడలోని ఎంవిబిలో భేటీ కాబోతోంది. బీజేపీయేతర పార్టీల నాయకులతో ఏర్పాటు అవుతున్న ఈ కీలక సమావేశంలో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, జైభారత్ నేషనల్ పార్టీల నేతలు హాజరై, ఏపీలో రాజకీయ కార్యాచరణపై చర్చించనున్నారు. సిపిఐ నాయకులు నారాయణ, రామకృష్ణ, చలసాని శ్రీనివాస్, సిపిఎం నాయకులు శ్రీనివాసరావు కాంగ్రెస్ , జైభారత్ నేషనల్ పార్టీ నాయకులు హాజరుకానున్నారు.