AP Highcourt :  ఈడబ్ల్యూఎస్ కోటా కింద కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ... జనసేన నేత చేగొండి హరిరామయ్య జోగయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగింది. కాపులకు రిజర్వేషన్లు కల్పించకపోవడం రాజకీయ కుట్ర అని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టులో వాదించారు.  కాపులు ఆర్ధికంగా నేటికి వెనుకబడి ఉన్నారన్నారు.  కాపులకు  ఐదు శాతం రిజర్వేషన్లు  లభిస్తే ఆర్ధికంగా బలోపేతం అవుతారని  భావిస్తున్నందునే  రిజర్వేషన్లను  జగన్  సర్కార్  వ్యతిరేకిస్తుందని  పిటిషనర్ తరపు న్యాయవాది  హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశానికి సంబంధించి  కౌంటర్ దాఖలు  చేయాలని  ఏపీ ప్రభుత్వాన్ని  హైకోర్టు ఆదేశించింది.  ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల  20వ తేదీకి వాయిదా వేసింది. 
 


కాపులకు ఈడబ్ల్యూఎస్ కోటా కింద రిజర్వేషన్లు 


అగ్రవర్ణాల్లోని పేదలకు కేటాయించిన 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ కోటా కింది 5 శాతం కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని గత ఏడాది డిసెంబర్ లో చేగొండి హరిరామజోగయ్య సీఎం జగన్ ను కోరారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో హరిరామజోగయ్య ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు.  అయితే పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసి ఏలూరు ఆసుపత్రికి తరలించారు. అలాగే 86 ఏళ్ల వయసులో ఆమరణ దీక్షకు దిగడంపై పవన్ కల్యాణ్ తో సహా, ఆయన సన్నిహితులు దీక్షపై పునరాలోచించాలని కోరారు. అనంతరం జోగయ్య దీక్ష విరమించారు. అయితే కాపు రిజర్వేషన్లపై తన ప్రాణం పోయేవరకు పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.  తాజాగా ఆయన రిజర్వేషన్లపై కోర్టును ఆశ్రయించారు. 


దేనికైనా సిద్ధమంటున్న జోగయ్య ! 
 
కాపు రిజర్వేషన్ల సాధించడానికి తాను చావడానికైనా సిద్ధమని మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు హరిరామజోగయ్య ఇప్పటికే స్పష్టం చేశారు.  కాపులపై సీఎం జగన్‌కు ఏమాత్రం ప్రేమ లేదని విమర్శించారు. కేంద్రం అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే అందులో 5 శాతం కాపులకు ఇవ్వడానికి టీడీపీ ప్రభుత్వం హయాంలో అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తుచేశారు. బిల్లు గవర్నర్‌ ఆమోదం పొందే సమయానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. దీంతో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు దక్కలేదని ఆరోపించారు. వైసీపీ మూడేళ్ల పాలనలో కాపులకు చేసిందేంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  


కాపు రిజర్వేషన్లు సాధ్యం కావంటున్న ప్రభుత్వం ! 


ఏపీలో కాపు రిజర్వేషన్ల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కాపులకు రిజర్వేషన్ల కల్పనపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య కీలక డిమాండ్ చేశారు. అగ్రవర్ణాల్లో వీకర్స్ సెక్షన్ కింద కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్లు కాపులకు అమలు చేయాలని సీఎం జగన్‌ను కోరారు. ఈ మేరకు ఆయన గత ఏడాది డిసెంబర్ లో ఓ వీడియో విడుదల చేశారు. రాష్ట్ర శాసనసభ చేసిన తీర్మానం మేరకు కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. కాపులకు రిజర్వేషన్ అంశంపై గత ఏడాది డిసెంబర్ 30వ తేదీలోపు ఉత్తర్వులు జారీ చేయాలని హరిరామ జోగయ్య డెడ్ లైన్ విధించారు. లేకపోతే జనవరి 2 నుంచి నిరహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. ఈ డెడ్ లైన్ పై రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. దీంతో ఆయన దీక్షకు దిగడం, దానిని పోలీసుల భగ్నం చేయడం ఆ తర్వాత జరిగిపోయాయి. మాజీ మంత్రి పేర్ని నాని హరిరామజోగయ్య డిమాండ్ కు మద్దతు తెలిపారు. కానీ వైసీపీ ప్రభుత్వం నుంచి జోగయ్య డిమాండ్ పై స్పష్టత రాలేదు.