Andhra Pradesh IAS officers Transfers :   ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఐఏఎస్ అధికారులను  బదిలీ చేశారు. ఈ సారి 19 మంది సీనియర్ అధికారులకు పోస్టింగులు ఇచ్చారు. గత  బదిలీల్లో కలెక్టర్లను మార్చడానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ సారి సెక్రటరీల స్థాయిలో బదిలీలు చేశారు. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి అనేక విమర్శలు ఎదుర్కొన్న ఐఏఎస్ అధికారులకు ఈ సారి కూడా పోస్టింగ్ దక్కలేదు. వారు ఇంకా జీఏడీకే రిపోర్టు చేసి ఉన్నారు. దర్మారెడ్డి, తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి వంటి డిప్యూటేషన్ పై వచ్చిన అధికారులపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.


తాజాగా బదిలీలు, పోస్టింగ్ పొందిన వారిలో అనంతరాము, రామ్ ప్రకాష్ సిసోడియా,  జి. జయలక్ష్మి, కాంతిలాల్ దండే, గిరిజా శంకర్, ఎస్. సురేష్ కుమార్, సౌరభ్ గౌర్, యువరాజ్, హర్షవర్థన్, పి.భాస్కర్, కె కన్నబాబు, వాడ్రేవు వినయ్ చంద్, వివేక్ యాదవ్, సూర్యకుమారి, సి శ్రీధర్, జె నివాస్, విజయరామ రాజు, హిమాన్షు శుక్లా, ఎస్ దిల్లీ రావు వంటి అధికారులు ఉన్నారు.


ఇద్దరు ఐపీఎస్ అధికారుల్ని కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మాజీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీగా నియమించారు. కుమార్ విశ్వజిత్ ను హోం సెక్రటరీగా నియమించారు.


పోస్టింగుల కోసం గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పలువురు తీవ్ర స్థాయిలో లాబీయింగ్ చేసుకుంటున్నారు. అయితే టీడీపీ నేతల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని జగన్ పన్నిన కుట్రల్లో ఉద్దేశపూర్వకంగా భాగం అయ్యారని.. చట్టాలను సైతం ఉల్లంఘించి అనేక తప్పుడు పనులు చేశారన్న కారణంగా అనేక మంది సీనియర్ అధికారులకు పోస్టింగ్ దక్కడం లేదు. వారిపై విచారణలకు ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంత మంది అధికారులు చంద్రబాబును కలిసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.                       


చంద్రబాబు సీఎంగా ఉండగా గతంలో ఆయనతో సన్నిహితంగా పని చేసిన వారు కూడా... తప్పుడు పనులు చేశారని టీడీపీ ఆరోపిస్తున్న వారిలో ఉన్నారు. వారిలో చాలా మంది తమ పాత పరిచయాలతో చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అధికార వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే టీడీపీ అధినేత మాత్రం.. తప్పు చేసిన వారిని ఇంక ఎంత మాత్రం ప్రోత్సహించేది లేదని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.                                                           


ఈ క్రమంలో సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ వీఆర్ఎస్ తీసుకున్నారు. ఏడేళ్ల సర్వీస్ ఉన్నప్పటికీ ఆయన వీఆర్ఎస్ తీసుకోవడం అధికారవర్గాల్లో కలకలం రేపుతోంది. ఇంకెంత మందికి అలాంటి పరిస్థితి వస్తుందోనని కంగారు పడుతున్నారు.