Anganwadi Strike ESMA: అమరావతి: ఏపీలో ఓవైపు అంగన్వాడీలు, మరోవైపు మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. అయితే ఇన్ని రోజులు కాలయాపన చేయడం వల్లే తాము ఉద్యమంలా సమ్మెను ముందుకు తీసుకెళ్తున్నామని కార్మికులు, అంగన్వాడీలు చెబుతున్నారు. రెండు, మూడేళ్లకు ఒకసారి జీతాల పెంపు వీలు కాదంటూ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదివరకే అంగన్వాడీలు సమ్మె విరమించపోవడంతో వారిపై ఏపీ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. ఆ కారణంగా 6 నెలల వరకు వారు సమ్మె చేయడానికి అవకాశం ఉండదు.


ఒక్క డిమాండ్ పెండింగ్ ఉందన్న మంత్రి బొత్స 
అంగన్వాడీలు మొత్తం 11 డిమాండ్లు చేయగా ఇప్పటికే 10 పరిష్కరించామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మిగిలిన ఒక్క డిమాండ్ సైతం త్వరలో పరిష్కరిస్తామన్నారు. అయితే తమకు మూడు నెలలు గడువు కావాలన్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నెగ్గి, మళ్లీ తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక అంగన్వాడీల సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తామని మంత్రి బొత్స పేర్కొన్నారు. అయితే ఐదేళ్లకు ఒక్కసారే ఉద్యోగుల జీతాల పెంపు సాధ్యమని, ఇలా 2, 3 సంవత్సరాలకు వేతనాల పెంపు సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, కానీ అందుకు కొంత సమయం కావాలన్నారు. 


అంగన్వాడీల సమ్మె నిషేధిస్తూ జీవో నెం 2
ఏపీ ప్రభుత్వం చర్చలు జరిపినా, అంగన్‌వాడీలు మాత్రం తమ డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా అంగన్వాడీలు వెనక్కి తగ్గకపోవడంతో అంగన్వాడీల సేవలను అత్యవసర సర్వీసు కిందకు తీసుకొచ్చింది. వారిపై ఎస్మా ప్రయోగిస్తూ జీవో నెం 2 విడుదల చేసింది. దాంతో 6 నెలలపాటు వీరు ఏ సమ్మె కార్యక్రమాలు చేపట్టడానికి వీలు ఉండదు. 


ఏంటీ ఎస్మా..
2013లో తీసుకొచ్చిన జాతీయ ఆహార భద్రత చట్టంలోని సెక్షన్ 39 పరిధిలోకి అంగన్వాడీలు వస్తారని ప్రభుత్వం వాదిస్తోంది. అందుకే అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగించినట్టు పేర్కొంది. ఈ ఎస్మాను 1981లో  తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి సమ్మెలు చేస్తే చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. అంగన్‌వాడీలను డిస్మిస్‌ చేయవచ్చు. కావాలనుకుంటే పరిస్థితిని బట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయవచ్చు. ఈ కేసుల్లో సమ్మెచేసిన వారికి ఆరు నెలలు, సహకరించిన వారికి ఏడాది జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.