Annadata Sukhibhav Vs Rythu Bharosa: ఆంధ్రప్రదేశ్‌లో శనివారం రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. గతంలో ఇలాంటి పథకాన్నే వైసీపీ ప్రభుత్వం కూడా అమలు చేసింది. దీంతో ఈ రెండు పథకాల మధ్య కంపారిజన్ సామాన్యంగా వస్తుంది. దీనిపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రైతులకు మీరు మోసం చేశారంటే మీరు వెన్ను పోటు పొడిచారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు ఏ పథకం ద్వారా రైతుకు ఎంత లబ్ధి చేకూరుతుంది, ఏ పథకం ఎప్పుడు ప్రారంభమైందో ఒకసారి చూద్దాం. 

Continues below advertisement

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా సంక్షేమ పథకాలు ప్రభుత్వాలు అమలు చేశాయి. అలాంటి వాటిలో ముఖ్య పథకాల్లో రైతు భరోసా, అన్నదాత సుఖీభవ ఒకటి. ఇందులో ఒకటి వైసీపీ హయాంలో అమలు చేస్తే రెండోది చంద్రబాబు అమలు చేస్తున్నారు. రైతుల ఖాతాల్లో నగదు వేసి వ్యవాసాయాన్ని ప్రోత్సహించడమే ఈ పథకాల లక్ష్యం. ముఖ్యంగా సన్న చిన్నకారు, కౌలు రైతులకు ఆర్థిక సాయం చేసి వ్యవసాయన్ని పండగ చేయాలనే సంకల్పంతో ఈ పథకాలను రెండు ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. 

రైతు భరోసా ఎప్పటి నుంచి అమలు అయ్యింది

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ 2019 ఏప్రిల్‌లో అధికారంలోకి వచ్చింది. వచ్చిన కొద్ది నెలలకే ఈ పథకాన్ని అమలు చేసింది. 2019 అక్టోబర్‌ 15న అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. మొదటి విడతగా 38 లక్షల మంది రైతులకు 3,785 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేశారు. మొదటి ఒక్కోరైతు ఖాతాలో 12,500 రూపాయలు వేయాలని మొదట అనుకున్నప్పటికీ దీనికి మరో వెయ్యి పెంచారు. 2019 నవంబర్‌ 26న ఈ నిర్ణయం తీసుకున్నారు. 

రైతు భరోసా ఎంత ఇచ్చారు?

వైసీపీ హయాంలో ఇచ్చే 13500 రూపాయలను మూడు విడతలుగా ఇచ్చారు. మొదటి విడత మే నెలలో అంటే ఖరీఫ్‌ వేళ పంటలు వేసుకోవడానికి 7500 రూపాయలు రైతు ఖాతాల్లో జమ చేశారు. రెండో విడతలో నాలుగ వేల రూపాయలు అక్టోబర్‌- నవంబర్ నెలలో ఇస్తున్నారు. ఇది ఖరీఫ్‌కోత సమయంలో రబీకి సిద్ధమైన టైంలో వేశారు. ఆఖరు విడత జనవరి - ఫిబ్రవరిలో అంటే పంట ఇంటికి వచ్చే టైంలో రెండు వేల రూపాయలు జమ చేసేవాళ్లు. అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం 7500 రూపాయలు ఇస్తే కేంద్రం ఆరు వేలు ఇచ్చేది రెండూ కలిపి 13500 రూపాయలు ఇవ్వడం ప్రారంభించారు.  

రైతు భరోసా ఏ సంవత్సరం ఎంత రిలీజ్ చేశారు?

ఈ పథకంలో భాగంగా ఏ సంవత్సరంలో ఎంత నిధులు ఇచ్చారో ఒక్కసారి పరిశీలిస్తే 

  సంవత్సరం లబ్ధిదారుల సంఖ్య విడుదల చేసిన నిధులు    
1 2019-20    46.69 లక్షలు   రూ. 6173కోట్లు 
2

2020-21

51.59 లక్షలు  

రూ. 6928కోట్లు 
3 2021-22    52.39 లక్షలు   రూ. 7,016.59కోట్లు
4 2022-23    52.41 లక్షలు   రూ. 6,944కోట్లు
5 2023-24  53.58 లక్షలు    

 2019 నుంచి 2023 వరకు నాలుగున్నర సంవత్సరాలలో సుమారు 33, 300 కోట్లు నుంచి 34, 288 కోట్లు వరకు నిధులు విడుదల చేశారు. 

రైతు భరోసా లబ్ధిదారుల అర్హతలేంటీ?

  • సొంత భూమి కలిగిన రైతులు
  • కౌలు రైతులు
  • అటవీ భూములు సాగు చేసే గిరిజన రైతులు 
  • దేవాదాయ భూములు సాగు చేసే రైతులు 
  • 2023-24లో 1,46, 324 మంది కౌలు రైతులకు 10.74 కోట్లు జమ చేశారు. 

అన్నదాత సుఖీభవ ఎప్పుడు ప్రారంభమైంది?

2024 జూన్‌లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా పేరు మార్చేసింది. అన్నదాత సుఖీభవగా అమలు చేస్తోంది. ఏటా ఒక్కో రైతుకు 20వేల రూపాయలు జమ చేయనున్నట్టు ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాది పథకాన్ని అమలు చేయలేదు. తొలి విడత నిధులను ఆగస్టు 2న విడుదల చేస్తోంది. 

అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఎంత ఇస్తున్నారు?

అన్నదాత సుఖీభవ కార్యక్రమంకు పీఎం కిసాన్ నిధులు కూడా జమ చేస్తున్నందున దీనికి పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పేరుతో ప్రచారం చేస్తోంది. రెండు ప్రభుత్వాల నిధులు కలిసి తొలి విడతలో 7 వేల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. అంటే కేంద్రం రెండు వేలు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కలుపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 14 వేలలో మొదటి విడతలో ఐదు వేలు ఇస్తోంది. ఇంకా రెండు విడతల్లో మిగతా 9 వేలు జమ చేయనుంది. 

అన్నదాత సుఖీభవ మొదటి విడత ఎంత రిలీజ్ చేస్తున్నారు?

అన్నదాత సుఖీభవ పథకానికి 46,85,838 మంది రైతులు అర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది. మొదటి విడత ఒక్కొక్కరి ఖాతాలో ఐదు వేల చొప్పున 2,342.92 కోట్ల రూపాయలు జమ చేస్తోంది. ఇప్పుడు ఐదు వేలు రెండో విడతలో మరో ఐదు వేలు, మూడో విడతలో నాలుగు వేలు రైతులకు అందజేయనుంది.