తూర్పుగోదావరి, కోనసీమ జిల్లా క్రాప్ హాలిడే అంశం కాక రేపుతోంది. ఇది రాజకీయంగా తెలుగు దేశం ఆడుతున్న డ్రామా అంటూ అధికార పార్టీ అటాక్ చేస్తుంటే.. కాదు ఇందులో రాజకీయం లేదంటూ కౌంటర్ అటాక్ చేస్తున్నారు కొందరు రైతులు. మొత్తానికి ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలోనే హాట్ టాపిక్‌గా మారిపోయింది.
కోనసీమ రైతుల క్రాప్ హాలీడే ప్రకటనపై మంత్రి విశ్వరూప్ తీవ్రంగా స్పందించారు. అమలాపురం కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి విశ్వరూప్ తెలుగుదేశం పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. క్రాప్ హాలిడే పేరుతో ప్రభుత్వంపై బురద చల్లడానికి టీడీపీ ప్రయత్నం చేస్తోందన్నారు. రాజకీయ లబ్ది కోసం తెలుగుదేశం పార్టీ ఆడుతున్న నాటకమే క్రాప్ హాలిడే అంటూ విరమ్సలు చేశారు.
నిజమైన రైతులు తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకు లోనుకాకుండా క్రాప్ హాలీడే ప్రకటనను ఖండించాలని మంత్రి పిలుపునిచ్చారు. రైతు భరోసా అమలుతో రైతులకు మేలు చేస్తున్నందుకు క్రాప్ హాలీడే పాటిస్తారా అని ప్రశ్నించారు మంత్రి విశ్వరూప్. రైతులు పార్టీ కార్యకర్తల్లా కాకుండా రైతుల ప్రయోజనాల కోసం పోరాడాలని సూచించారు.
జూన్ 1వ తేదీకే సాగునీటి విడుదలతో మూడు పంటలు పండించడానికి అవకాశం ఉందని ఇలాంటి అవకాశాలను జారవిడుచుకోవద్దని సూచించారు మంత్రి విశ్వరూప్. తెలుగుదేశం పార్టీ వలలో పడొద్దని రైతులకు సలహా ఇచ్చారు. రైతులు నిరభ్యంతరంగా మొదటి పంట సాగు చేసుకోవచ్చని అన్నారు.
కోనసీమలోని క్రాఫ్ హాలిడే ఉద్యమంలో రాజకీయ కోణం లేదని కొందరు రైతులు ప్రకటించారు. ఆర్డీవో రమ్మంటే వచ్చామని.. ఆర్డీవో కానీ కలెక్టర్ కార్యాలయంలో గానీ అధికారులు ఎవరు అందుబాటులో లేరని చెప్పుకొచ్చారు. ఇటువంటి రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండానే రైతులు నష్టాలను భరించలేక ఉద్యమం బాట పట్టామని వెల్లడించారు. ఈ ఉద్యమంలో అన్ని పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఉన్నారన్నారు. అంతేగాని ఇది రాజకీయ కోణంలో చూడొద్దని ప్రభుత్వానికి సూచించారు రైతులు.
ప్రధానంగా మూడు డిమాండ్లు అధికారుల ముందు ఉంచామంటున్నారు రైతులు. ఇదే విషయాన్ని అధికారులకు వివరించేందుకు ప్రయత్నించినట్టు పేర్కొన్నారు. రమ్మని పిలిచిన అధికారులు అందుబాటులో లేకుండా పోయారన్నారు. కార్యచరణను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. రైతుకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు.. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో డబ్బులు ఇప్పించాలని వేడుకున్నారు రైతులు.
తమ ఉద్యమంలో భూస్వాముల లేరని.. వారు ఉద్యమానికి సహకరించారని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా నష్టపోయేది రైతులేనన్నారు. డ్రైన్లు అధ్వానంగా మారాయని పేర్కొన్నారు. తొలకరి పంట వేస్తున్నప్పుడు వర్షాలకు ముంపుకు గురయ్యి నష్టపోతున్నామని వాపోయారు.
గిట్టుబాటు ధర కల్పించాలని.. డ్రెయిన్లు ఆధునికరించాలని వేడుకున్నారు రైతులు. రైతులకు అవసరమైన సమయంలో ఉపాధి హామీ పనులను తాత్కాలికంగా నిలపాలని సూచించారు. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలన్నారు. యాంత్రీకరణ విషయంలోనూ రైతులకు అన్యాయం జరుగుతుందని వివరించారు.
క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నట్లు ఇప్పటికే అన్ని మండలాల్లోనూ తాహసిల్దార్‌లకు వినతి పత్రాలు అందిస్తామన్నారు. త్వరలోనే తమ ఉద్యమ కార్యాచరణను వెల్లడిస్తామని పేర్కొన్నారు రైతులు. కోనసీమ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ ఉద్యమం జరుగుతోందని.. ఏ పార్టీలకు సంబంధం లేదన్నారు. కోనసీమ రైతు పరిరక్షణ సమితి అధ్యక్షుడు యాళ్ళ బ్రహ్మానందం ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయానికి తరలివచ్చిన రైతులు... ఆర్డీవో అందుబాటులో లేకపోవడంతో గంట సేపు వేచి చూసి నిరసన తెలిపి తిరిగి వెళ్లిపోయారు.