Adilabad Latest News: రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా రైతులకు ఆర్థిక సాయం చేయడంతోపాటు వారికి పరికరాలు కూడా అందిస్తోంది. వాటికి రాయితీ ఇస్తోంది. సబ్‌మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకైజేషన్ పేరుతో కేంద్రం ఈ పథకాన్నిఅమలు చేస్తోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా భాగస్వామ్యం చేస్తోంది. ఈ పథకం దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఎలా దరఖాస్తు చేయాలి అర్హులు ఎవరో ఇక్కడ చూద్దాం.
వ్యవసాయాన్ని ఆధునీకరించే ప్రక్రియలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు యంత్రాలను సమకూరుస్తున్నాయి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను మరింతగా చేయూత ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నాయి. వారికి యంత్రాలు సమకూర్చేందుకు దరఖాస్తు స్వీకరిస్తున్నారు అధికారులు. ఈ ప్రక్రియ ప్రారంభమై రెండురోజుల అయ్యింది.
వ్యవసాయంలో యాంత్రీకరణ పెంచి ఉత్పాదకతను పెంచడమే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. రైతులకు యంత్రాలు ఇచ్చే ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు కేటాయిస్తే కేంద్రం 60 శాతం నిధులు సమకూరుస్తుంది. అర్హులైన రైతుల ఎంపిక కోసం జిల్లా, మండలస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశారు. సోమవారం నుంచి దఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు సెప్టెంబర్ నుంచి యంత్రాల పంపిణీ చేపట్టనున్నారు.
ఎస్‌ఎంఏఎం అర్హతలు ఏంటీ?
వ్యవసాయ యంత్రాల పొందేందుకు ప్రభుత్వం కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసింది. వాటికి అనుగుణంగానే ఎంపిక చేయనున్నారు.
రాయితీపై పరికరాలు పొందేందుకు రైతులకు కనీసం ఎకరా భూమి ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గానికి చెందిన రైతులకు మాత్రమే పథకం వర్తిస్తుంది.
అర్హత ఉన్న రైతులు మండల ఏఈవోలకు దరఖాస్తు చేయాలి
పట్టాదారుపాస్‌బుక్, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు దరఖాస్తుతోపాటు సమర్పించాలి.
రైతులకు అందించే వ్యవసాయ పరికరాలను మహిళలకు యాభై శాతం రాయితీ అందిస్తారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 40 శాతం రాయితీ కల్పిస్తారు. ఆ డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయి.
కుమ్రమ్ భీమ్ అసిఫాబాద్ జిల్లాకు నిధులు కేటాయింపు
కుమ్రమ్ భీమ్ అసిఫాబాద్ జిల్లాకు 3598 యూనిట్లు కేటాయించారు. దీనికి దాదాపు 2.5 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశారు. బ్యాటరీ స్ప్రేయర్లు జిల్లాకు 2659, పవర్ స్ప్రేయర్లు 464, కల్టివేటర్ 185, ఇలా దాదాపు పది రకాల పరికరాలు జిల్లాకు ఇచ్చారు. ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న రైతుల వివరాలు ఆధారంగా జిల్లా మండ కమిటీలు సమావేశమై ఎవరికి ఏ పరికరాలు ఇవ్వాలని డిసైడ్ చేసారు.