Runa Mafi for Telangana Farmers: రైతు రుణమాఫీ... దీని కోసం తెలంగాణ రైతులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి చూపిస్తామని లోక్‌సభ ఎన్నికల ముందు సవాల్‌ చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. 2లక్షల వరకు ఉన్న రుణాలు మాపీ చేస్తామని ప్రకటించారు. అన్నట్టుగానే వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. వచ్చే వారం నుంచే పంట రుణమాఫీ ప్రారంభంచాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఇందు కోసం అవసరమైన నిధులను  సమకూర్చుకుంటోంది. రెండు రోజుల్లోనే రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటికే... పంట రుణమాఫీకి సంబంధించి... మార్గదర్శకాలను అధికారులు సిద్ధం చేశారు. ఆ ఫైల్‌  ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి టేబుల్‌పైకి వెళ్లింది. ఒకటి, రెండు రోజుల్లో మార్గదర్శకాలకు ఆమోద్రముద్ర పడుతుంది. 


రుణమాఫీకి నిధుల సేకరణ...
తెలంగాణ రైతులకు రూ.2లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేయాల్సి ఉంది. 2018 డిసెంబర్‌ 12 నుంచి 2023 డిసెంబర్‌ 9వ తేదీ వరకు తీసుకున్న రుణాలు మాఫీ చేయాలని కేబినెట్‌ సమావేశంలో నిర్ణయించారు. ఆ సమయంలో తీసుకున్న  2లక్షల రూపాయల వరకు పంట రుణాలను మాఫీ చేసేందుకు... సుమారు 31 వేల కోట్లు అవసరమవుతాయని కూడా... కేబినెట్ ప్రాథమికంగా అంచనా వేసింది. దీంతో.. నిధుల సమీకరణను వేగవంతం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే  10వేల కోట్ల రూపాయల వరకు సమకూర్చుకున్నట్టు తెలుస్తోంది. మిగతా 21 వేల కోట్ల రూపాయలు సేకరించేందుకు మార్గాలు అన్వేషిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌లో 4వేల కోట్లు, మేలో 4వేల కోట్లు, జూన్‌లో 5వేల కోట్ల రూపాయల  చొప్పున మార్కెట్‌ రుణాలను సేకరించారు. జులై, ఆగస్టు నెలల్లో తీసుకునే మార్కెట్‌ రుణాల్లోనూ కొన్ని నిధులను రుణమాఫీకి మళ్లించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జులైలో 6వేల 500 కోట్లు.. ఆగస్టు నెలలో 5వేల కోట్లు రుణం తీసుకోవాలని  భావిస్తోంది. అలాగే... హైదరాబాద్‌ చుట్టుపక్క లున్న ప్రభుత్వ భూములను ప్రైవేట్‌ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి... రుణాలు తీసుకోవాలని కూడా ఆలోచిస్తోంది. ఆ విధంగా మరో 10వేల కోట్ల రూపాయలు సమకూర్చుకోవాలని కసరత్తు చేస్తోంది తెలంగాణ  ప్రభుత్వం.


మూడు దశల్లో రైతు రుణమాఫీ...
రుణమాఫీని మూడు దశలుగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ముందుగా లక్ష రూపాయల వరకు పంట రుణాలు మాఫీ చేయనుంది. ఆ తర్వాత ఒకటిన్నర లక్ష వరకు ఉన్న పంట రుణాలు మాఫీచేసి... చివరిగా మూడో దశలో  రెండు లక్షల వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేయాలని ఆలోచిస్తోంది. ఇలా చేస్తే... కాస్త ఆర్థిక భారం తగ్గించుకోవచ్చని... నిధుల సమీకరణకు కూడా సమయం ఉంటుందనేది తెలంగాణ ప్రభుత్వం యోచన. అయితే... మూడ విడతల్లో రుణమాఫీ  చేసినా... మొత్తం ప్రక్రియ రోజుల వ్యవధిలోనే పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏది ఏమైనా... వచ్చే వారంలో.... అంటే ఈనెల 15 తర్వాత రుణమాఫీని ప్రారంభించే అవకాశం ఉందని.. ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. 


రైతు భరోసా సదస్సులు....
రైతు రుణమాఫీతోపాటు.. రైతు భరోసాపై కసరత్తు చేస్తోంది కాంగ్రెస్‌ ప్రభుత్వం. రైతు భరోసా విధివిధానాలు ఖరారు చేసేందుకు... ఇప్పటికే రైతు భరోసా సదస్సులు నిర్వహిస్తోంది. ఇవాళ (జుల్‌ 10వ తేదీ) ఖమ్మంతో మొదలుపెట్టి... ఈనెల 22 వరకు  ఉమ్మడి జిల్లాల వారిగా వర్క్‌షాప్స్‌ నిర్వహిస్తోంది. రైతులు, రైతు సంఘాల నేతల నుంచి అభిప్రాయాలు సేకరిస్తోంది. అందరి అభిప్రాయాలు సేకరించాక... డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని కేబినెట్‌ సబ్‌కమిటీ విధివిధానాలపై ఒక నివేదిక  తయారుచేసి ప్రభుత్వానికి అందిస్తుంది. ఆ నివేదిక వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సభ ముందు పెడతారు. సభలోనే రైతు భరోసాపై సీఎం రేవంత్‌రెడ్డి విధివిధానాలు ప్రకటించే అవకాశం ఉంది.