PM Kisan Money :  తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. 15వ విడత పీఎం కిసాన్ నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం విడుదల చేయనున్నారు. ఝార్ఖండ్ లోని ఖుంతీలో బిర్సా కాలేజీ వేదికగా రైతుల ఖాతాలోకి పీఎం కిసాన్ (PM KISAN Scheme) నగదు జమ చేయనున్నారు. మొత్తం రూ.18,000 వేల కోట్లు ప్రధాని మోదీ విడుదల చేయగా, రైతుల ఖాతాల్లో రూ.2,000 జమ కానున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ అధికారులు తెలిపారు.


దేశ వ్యాప్తంగా 8 కోట్లకు పైగా రైతులకు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంగా ప్రతి ఏటా 6000 రూపాయలు (PM KISAN Money) అందిస్తుంది. ఎరువులు కొనుగోలుకు, వ్యవసాయానికి సంబంధించి ఆర్థిక సాయం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు నాలుగు నెలలకు ఒకసారి 2000 చొప్పున 3 విడతలుగా మొత్తం రూ. 6 వేల ఆర్థిక సాయం చేయనుంది. బిర్సా కాలేజీలో 'జనజాతీయ గౌరవ్ దివస్'ని పురస్కరించుకుని 15వ విడత పీఎం కిసాన్ సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.


రైతుల ఖాతాల్లోకి 15వ విడత పీఎం కిసాన్ నగదు 
ప్రతి ఏడాది 3 విడతలుగా రెండు వేల చొప్పున మొత్తం ఆరు వేల రూపాయలను రైతుల ఖాతాల్లో కేంద్రం జమ చేయనుంది. అందులో భాగంగా ఈ ఏడాది జూలైలో పీఎం కిసాన్ 14 వ విడత నిధులను విడుదల చేసింది. నవంబర్ 15న (బుధవారం) పదిహేనో విడత నగదును విడుదల చేసి రైతుల ఖాతాల్లో రూ.2 వేలు జమ చేయనున్నారు ప్రధాని మోదీ. ఝార్ఖండ్, కుంతీలోని బిర్సా వర్సిటీలో నిర్వహించనున్న కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కృషి విజ్ఞాన కేంద్రాలు (KVKలు), ఏసీఏఆర్ ఇన్‌స్టిట్యూట్‌లు, రాష్ట్ర వ్యవసాయ వర్సిటీలు, పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, సాధారణ సేవా కేంద్రాలు ద్వారా ప్రసారం చేయనున్నారు.






ఈ కేవైసీ పూర్తి చేసిన రైతులను కేంద్రం లబ్దిదారులుగా పరిగణించనుంది. పీఎం కిసాన్ 15వ విడత లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో అన్నదాతలు  అధికారిక వెబ్ సైట్ https://pmkisan.gov.in/ లో చెక్‌ చేసుకోవచ్చు. eKYC చేయించని వారిని లబ్ధిదారులు జాబితా నుంచి కేంద్రం ప్రభుత్వం తొలగిస్తోంది. వివరాలు తెలుసుకునేందుకు పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నెంబ‌రు 155261 / 011- 24300606కు కాల్ చేసి వివరాలు తెలుసుకునే ఛాన్స్ ఉంది.


మీ పీఎం కిసాన్ బ్యాంక్ ఖాతాతో, ఆధార్ కార్డ్‌ లింక్ చేస్తేనే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది. వీరిని మాత్రమే కేంద్రం లబ్దిదారులని, ఈ కేవైసీ చేయని రైతులను అనర్హులుగా పరిగణిస్తామని గతంలోనే కేంద్రం స్పష్టత ఇచ్చింది. eKYCని చేయించడం ద్వారా లబ్దిదారులు అవుతారు.