BRS Working President KTR Comments On Seed Distribution  : రాష్ట్రంలోని రైతులకు విత్తనాల పంపిణీ చేస్తున్న తీరు పట్ల మాజీ మంత్రి, భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విత్తనాలు తీసుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. విత్తనాల పంపిణీకి సంబంధించి ఇబ్బందులను చెబుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ ట్వీట్ చేసిన కేటీఆర్.. ప్రభుత్వ తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? అని కేటీఆర్ ప్రశ్నించారు.


విత్తనాల కోసం రైతులకు వెతలు తప్పడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విత్తనాల పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించాల్సిన వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడ ఉన్నారన్న కేటీఆర్.. ముందు చూపు లేని ముఖ్యమంత్రి జాడేదని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప.. ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్క లేదా..? అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం అమ్ముకుందామంటే కొనేవాడు లేక రైతులు ఇబ్బందులు పడ్డారని, విత్తనాలు కొందామంటే ప్రస్తుతం అమ్మేవాడు లేక రైతులు అవస్థలు పడుతున్నారని కేటీఆర్ విమర్శించారు.




రాష్ట్రంలో ప్రభుత్వ పాలన పూర్తిగా పడకేసిందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలని కేటీఆర్ ప్రశ్నించారు. సాగునీరు ఇవ్వడం చేతకాక పంటలను ఎండగట్టారని, ఇప్పుడు విత్తనాలు అందించే విజన్ కూడా లేదా అని దుయ్యబట్టారు. గడిచిన 10 ఏళ్లలో రైతులకు 10 నిమిషాల్లో విత్తనాలు అందించామని, ప్రస్తుతం 10 గంటలపాటు పడిగాపులు పడిన అందించలేరా అంటూ కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు.


రంగారెడ్డి నుంచి కామారెడ్డి దాకా రైతులకు విత్తనాలు కష్టాలు తప్పడం లేదని, ఇంకెన్నాళ్లపాటు ఈ కన్నీళ్లు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దేశంలోని ప్రజల కడుపు నింపే స్థాయికి ఎదిగిన తెలంగాణ.. ప్రస్తుతం అన్నదాతకే తిండి తిప్పలు లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరిపడా విత్తనాలు స్టాక్ తెప్పించాలని, బ్లాక్ మార్కెట్ కు తరలించకుండా కళ్లెం వేయాలని కేటీఆర్ ప్రభుత్వానికి సూచించారు. అన్నదాతలను అరిగోస పెట్టకుండా చూడాలని కోరిన కేటీఆర్.. లేకపోతే రైతుల సంగటితశక్తిలో ఉన్న బలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చవి చూడక తప్పదని హెచ్చరించారు.