Rythu Bharosa Scheme In Telangana | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను సోమవారం (జూన్ 16న) విడుదల చేశారు. రైతునేస్తం వేదిక నుంచి ఆన్ లైన్ లో బటన్ నొక్కి రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులను జమ చేశారు. ప్రస్తుతానికి రెండు ఎకరాల్లోపు భూమి కలిగి ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది ప్రభుత్వం. ఖరీఫ్ సీజన్ మొదలైంది, పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ.6 వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. రబీ సీజన్‌లోనూ పంట పెట్టుబడి కోసం ప్రభుత్వం మరో రూ.6 వేలు ఎకరానికి అందించనుంది.

Continues below advertisement


మొత్తం 9 రోజుల్లో 9 వేల కోట్లు రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. జూన్ 16న ఒక్క ఎకరా, అంతలోపు ఉన్న రైతులు 24 లక్షల 22 వేల 678 మంది రైతుల ఖాతాల్లో 8,12,63,26,111 కోట్ల రూపాయలు జమ చేశారు. 2 ఎకరాలు ఉన్న 17 లక్షల 2 వేల 611 మంది రైతుల ఖాతాల్లో 15,37,20,12,657 కోట్లు జమ చేశారు. మొత్తంగా 39.16 లక్షల ఎకరాలకుగానూ 2,349.83 కోట్లను తెలంగాణ ప్రభుత్వం అన్నదాతల ఖాతాల్లో జమ చేసింది. తెలంగాణ రైతు భరోసా పథకం లబ్ధిదారులు నగదు స్టేటస్ ను ఆన్‌లైన్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. 


తెలంగాణ రైతు భరోసా స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో ఇలా చెక్ చేసుకోండి. 
1) ముందుగా రైతుభరోసా అధికారిక పోర్టల్‌ rythubharosa.telangana.gov.inను సందర్శించండి
2) కుడివైపు మూలలో ఉన్న లాగిన్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి
3) లబ్ధిదారులు పేరు, పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి. లేకపోతే మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీని వెరిఫై చేసుకోండి.
4) లాగిన్ అయిన తర్వాత చెల్లింపు స్థితి(Payment Status) లేదా లబ్ధిదారుల జాబితా విభాగానికి వెళ్లాలి 
5) మీ చెల్లింపు స్థితి చెక్ చేయడానికి ఆధార్ నంబర్‌ను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
6) వివరాలు సమర్పించి సబ్మిట్ చేసిన తరువాత మీ రైతు భరోసా స్టేటస్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.


అర్హులైన రైతులు అందరికీ పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నగదును ఏడాదికి రెండు పర్యాయాలు వారి ఖాతాల్లో జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు భరోసా నిధులు ఇంకా రాలేదని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతానికి కేవలం 2 ఎకరాల్లోపు వారికే ఇచ్చామని, తొమ్మిది రోజుల్లో మొత్తం లబ్ధిదారుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయాన్ని జమ చేస్తామని స్పష్టం చేశారు.