నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు భగ్గుమంటున్నారు. పార్టీలకు అతీతంగా పోరుబాట పట్టేందుకు రెడీ అయ్యారు. పసుపు బోర్డు సాధన, పసుపునకు మద్దతు ధర, జగిత్యాల జిల్లా ముత్యంపేట చెరకు ఫ్యాక్టరీ పునరుద్ధరణ ప్రధాన డిమాండ్లతో ఉద్యమానికి సిద్ధమయ్యారు. 


అడిగి అడిగి విసిగిపోయిన పసుపు రైతులు ఇప్పుడు ప్రత్యక్ష ఉద్యమానికి సిద్ధమయ్యారు. మూడు ప్రధాన డిమాండ్లతో ఈ నెల 3 నుంచి పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. పార్టీలతో సంబంధం లేకుండా రైతులంతా ఈ పాదయాత్రలో పాల్గొంటారు. జగిత్యాల జిల్లా ముత్యంపేట చెరకు ఫ్యాక్టరీ నుంచి నిజామాబాద్ కలెక్టరేట్ వరకు పాదయాత్ర సాగనుంది. పాదయాత్రకు సంబంధించి ఏర్పాట్లను రైతులు పూర్తి చేశారు.


ఈ ఉద్యమానికి పసుపు రైతులు నాయకత్వం వహిస్తున్నారు. కానీ రైతులకు సంబంధించిన అన్ని సమస్యలపై పోరాటం చేస్తామంటున్నారు రైతులు. ముత్యంపేట చెరకు ఫ్యాక్టరీ నుంచి నిజామాబాద్ కలెక్టరేట్ వరకు దాదాపు 70 కిలో మీటర్ల మేర ఈ పాదయాత్ర కొనసాగనుంది. పసుపు రైతులతోపాటు అందరికీ మేలు జరిగే లక్ష్యంతో ఈ పాదయాత్ర చేపట్టామని అంటున్నారు. 5 రోజుల పాటు పాదయాత్ర కొనసాగనుంది. ఈ నెల 7న నిజామబాద్ కలెక్టరేట్ వద్ద పాదయాత్ర ముగుస్తుంది.  


రేపు ముత్యంపేట నుంచి ప్రారంభమై నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి వరకు వస్తుంది. రెండో రోజు మోర్తాడ్ మీదుగా అంక్సాపూర్ వరకు కొనసాగుతుంది. మూడో రోజు అంక్సాపూర్ నుంచి పెర్కిట్ వరకు నిర్వహిస్తారు. నాలుగో రోజు ఆర్మూర్‌లో ప్రారంభించి అంకాపూర్‌లో నిలిపివేస్తారు. ఐదో రోజు నిజామాబాద్ మార్కెట్ యార్డు అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు కొనసాగుతుంది. ప్రతి రోజు పాదయాత్ర జరిగే రోడ్డుకు ఇరువైపులా ఆయా గ్రామాల రైతులు పసుపు రైతులకు సంఘీభావం తెలిపుతారు.


పసుపు రైతులు పాదయాత్రలో పాల్గొనే విధంగా ఇప్పటికే రైతు ఐక్య కార్యచరణ వేదిక సమావేశాలు సదస్సులు నిర్వహిస్తూ అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఈ పాదయాత్ర ఏ పార్టీలకు సంబంధం లేకుండా పసుపు రైతులు మాత్రమే పాల్గొననున్నారని చెప్పారు. పాదయాత్రలో పాల్గొనే రైతులు రాజకీయ పార్టీలకు చెందిన కండువాలు వేసుకోరాదని ఐక్యవేదిక నాయకులు రైతులకు స్పష్టం చేశారు.


తెలంగాణ ప్రభుత్వం వరి వేయొద్దని ఆంక్షలు పెట్టింది కానీ దానికి ప్రత్యామ్నాయంగా ఎలాంటి విధి విధానాలు ఖరారు చేయలేదంటున్నారు రైతులు. వరి ప్రత్యామ్నాయంగా చెరకు వేస్తే సమీపంలో చెరకు ఫ్యాక్టరీలు లేవని.. దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని వాపోతున్నారు. అందుకే ముత్యంపేట చెరకు ఫ్యాక్టరీ తెరిస్తే రైతులకు మేలు జరుగుతుందని డిమాండ్ చేస్తున్నారు. పసుపు బోర్డు, మద్దతు ధర విషయంలోనూ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదన్న రైతులు, వీటన్నింటినీ సాధించుకునేందుకే పాదయాత్ర చేస్తున్నట్టు పేర్కొన్నారు.