Urea availability in Andhra Pradesh | విజయవాడ: రైతులకు ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సరఫరా వ్యవస్థను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని ఆ శాఖ అధికారులను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) ఆదేశించారు. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎరువుల సరఫరా యథావిధిగా సాగుతున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న సమాచారంతో విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు, మార్క్‌ఫెడ్ ఎండీ మనజీర్ జిలానీ సామున్, ఇతర అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో కమిషనర్ ఢిల్లీ రావు మాట్లాడుతూ.. 2025 ఖరీఫ్ సీజన్‌ కోసం ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 16.73 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల అవసరం ఉందని వెల్లడించారు. ఇందులో యూరియా అవసరం 6.22 లక్షల మెట్రిక్ టన్నులు, డీఏపీ 2.60 లక్షల మె. టన్నులు, ఎంఓపీ 0.70 లక్షల మెట్రిక్ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 0.94 లక్షల మె. టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 6.30 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం ఉందని వివరించారు.

ఎరువుల రాక ఆలస్యంతో సరఫరాలో జాప్యం

కేంద్రం నుంచి ఆగస్ట్ నెలలో రావలసిన కొన్ని ఎరువులు ఆలస్యం కావడంతో కొన్ని ప్రాంతాల్లో సరఫరాలో అంతరాయం ఏర్పడిందని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి 10.39 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు వచ్చాయని, ప్రారంభ నిల్వలతో కలిపి మొత్తం 17.53 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఢిల్లీ రావు పేర్కొన్నారు. ఇప్పటివరకు 10.96 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులకు సరఫరా చేసినట్టు తెలిపారు. 6.56 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రాష్ట్రంలోని సహకార సంఘాలు, ప్రైవేట్ వ్యాపారుల వద్ద అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.

అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడైనా రైతులకు ఇబ్బందులు ఎదురైతే, వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  అవసరమైన ప్రాంతాలకు మార్క్‌ఫెడ్ గోదాముల్లోని నిల్వలను త్వరితంగా పంపాలన్నారు. ప్రైవేట్ డీలర్లు యూరియా, డీఏపీ వంటి ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు సమాచారం ఉన్నందున, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

ఇటీవల ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్, రాష్ట్రానికి రావలసిన పెండింగ్ ఎరువుల విషయంపై కేంద్ర మంత్రి నడ్డాను కలిసి తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్టు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన ఎరువులలో 19,000 మెట్రిక్ టన్నులు RFC రామగుండం నుంచి, 30,000 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్ట్, 18,500 మెట్రిక్ టన్నులు గంగవరం పోర్ట్ ద్వారా రావాల్సి ఉందన్నారు. ఇవి త్వరలో రాష్ట్రానికి చేరేలా చర్యలు తీసుకుంటామని, రైతులు ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు.

యూరియా కొరత విషయంలో, తదుపరి 3 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. ఎవరు కావాలనే కొరత సృష్టించినా ఉపేక్షించబోమని, రైతులకు ఇబ్బందులు కలిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఫర్టిలైజర్స్ జేడీ కృపాదాస్, మార్క్‌ఫెడ్ జీఎం శ్రీనివాస్, వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.