Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అమరావతి వాతావరణ శాఖ ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఇవాళ, రేపు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అప్పటి వరకు ఎండలతో అల్లాడిన జనం ఇప్పుడు వర్షం వస్తుందని సంతోషపడాలో లేక పంటలు పోతున్నాయని బాధ పడాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఏ జిల్లాల్లో ఎంత ప్రభావం
వాతావరణ పరిస్థితులను గమనిస్తే, రాబోయే 24 గంటల్లో కొన్ని జిల్లాల్లో వర్షం తీవ్రత చాలా ఎక్కువగా ఉండేలా కనిపిస్తోంది. ముఖ్యంగా తీర ప్రాంతాలు, రాయలసీమ జిల్లాల్లో వానలు దంచికొట్టే ఛాన్స్ ఉంది. ప్రత్యేకంగా కొన్ని జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. విజయనగరం, అనకాపల్లి, ఎన్టీఆర్, గుంటూరు, అనంతపురం, బాపట్ల, శ్రీసత్యసాయి, విశాఖపట్నం, కృష్ణా, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని సమాచారం. అదే సమయంలో పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం కూడా విజయనగరం, వైజాగ్, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో పిడుగుల ముప్పు పొంచి ఉంది.
పిడుగుల ముప్పు- ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వర్షం కురిసే సమయంలో కేవలం తడవకుండా ఉంటే సరిపోదు, పిడుగుల బారి నుంచి ప్రాణాలు కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షం పడుతున్నప్పుడు పొరపాటున కూడా చెట్ల కింద నిలబడకూడదు. అలాగే ఎలక్ట్రిక్ పోల్స్, బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండటం మంచిది. పిడుగు పడే సమయంలో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు.
అన్నదాతలకు వాతావరణ శాఖ కీలక సూచనలు
ఈ అకాల వర్షాలు, పిడుగుల వల్ల ఎక్కువ నష్టపపోయేది రైతన్నలే. అందుకే వ్యవసాయ పనులు చేసుకునే రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ కోరుతోంది. పంట పొలాల్లో పని చేసే సమయంలో ఆకాశంలోని వాతావరణ మార్పులు గమనిస్తూ ఉండాలి. గాలి వానలు లేదా పిడుగులు పడే సూచనలు కనిపిస్తే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి.
అసలు ఈ మార్పులకు కారణం ఏంటీ?
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల గాలులు దిశలో మార్పులు రావడం, వాతావరణంలో తేమ శాతం అధికంగా ఉండటం వల్ల మేఘాలు త్వరగా ఏర్పడి ఇలాంటి వర్షాలకు దారి తీస్తాయి.
