Konaseema News : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దాళ్వా పంట సాగునీరు లేక ఎండిపోతున్న పరిస్థితి తలెత్తింది. ఈ పరిస్థితి డెల్టా ప్రాంతంలో మరీ దారుణంగా మారింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పరిధిలో చాలా ఆయకట్టులోని వరిచేలు సాగునీరు అందక బీడుబారుతున్నాయి. దీంతో రైతులు అనేకసార్లు అధికారులకు మొరపెట్టుకుంటున్నా పట్టించుకోకపోవడంతో రైతులు నిరసన బాట పడుతున్నారు. ఈ క్రమంలోనే అమలాపురం రూరల్‌ మండలంలోని జనుపల్లి, వేమవరం తదితర గ్రామాల్లోని థైలాండ్‌ ప్రాంతంలో చేలు చాలావరకు ఎండిపోయి బీటలు వారడంతో ఆగ్రహించిన పలువురు రైతులు పొలాల్లో మోటారు సైకిళ్లు నడిపి తమ నిరసన తెలిపారు. అధికారులను ఆ ప్రాంతానికి పిలిచి చేలను చూపించి సాగునీరందక పోవడంతో నిలదీశారు. నీరు అందితే చేలు పనిచేస్తాయని పాడుచేసుకోవద్దని హితవు పలికినా రైతులు వినిపించుకోలేదు. ఇక మేము పడలేం అంటూ చేలో మోటారు సైకిళ్లు నడిపి తమ నిరసన తెలిపారు. పి.గన్నవరం నియోజకవర్గంతోపాటు, అమలాపురం గ్రామీణ మండలంలో పలు చోట్ల రైతులు ఇదే తరహా నిరసనలు చేస్తున్నారు.


అన్నిచోట్ల సాగునీటి ఎద్దడి 


గోదావరి డెల్టా ప్రాంతంలో సాగు నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ఈనేపథ్యంలో శివారు ప్రాంతాల్లో ఆయకట్లు పూర్తిస్థాయిలో సాగునీరందని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే వంతులవారీ విధానాన్ని జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఇరిగేషన్‌ అధికారులు అమలు చేస్తున్నారు. సెంట్రల్‌ డెల్టాలోని మూడు ప్రధాన పంటకాలువల ద్వారా వంతుల వారీగా సాగునీటి, తాగునీటి అవసరాలకు విడుదల చేస్తున్నారు అధికారులు. అయితే పలుప్రాంతాల్లో డ్రైయిన్లు, పంటకాల్వలు అధ్వాన్న పరిస్థితిలో ఉండడంతో కాలువల్లో నీరు చాలాచోట్ల వృథాగా పోతోంది. ఇది గమనించిన అధికారులు యుద్ధప్రాతిపదికన 87 చోట్ల నాలుగు ప్రధాన డ్రైన్లకు క్రాస్‌బండ్‌లు ఏర్పాటు చేసి అటు సముద్రం నీరు పోటెత్తకుండా ఇటు పంటకాలవుల్లోని సాగునీరు సముద్రంలోకి వృథాగా పోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ డ్రైన్లు, పంటకాలువల వ్యవస్థ దెబ్బతినడంతో చాలా సాగునీరు వృథాపోతుందంటున్నారు. ఇదిలా ఉంటే సాగునీరు చౌర్యానికి గురవుతోంది. ఆక్వారంగం బాగా పెరిగిపోవడంతో చెరువుల్లో ఉప్పునీటి సాంద్రతను తగ్గించుకునేందుకు పంటకాలువల్లో ఇంజిన్లు పెట్టి నీటి చౌర్యాన్ని చేస్తున్నారు. దీంతో వ్యవసాయానికి సాగునీరు అక్కరకు రాకుండా పోతోంది.


వర్షంతో ఉపశమనం 


వాతావరణ శాఖ ప్రకటించినట్లే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చెదురుమొదురు వర్షాలు కురుస్తున్నాయి. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పరిధిలో పలు చోట్ల శుక్రవారం ఉదయం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎండిపోయిన పొలాల్లో మోటారు సైకిళ్లతో పంటను ధ్వంసం చేసుకున్న రైతులు మాత్రం తాము చేసిన పనిని సమర్ధించుకుంటున్నారు. 


69 గ్రామాల్లో సాగునీటి సమస్యలు 


రబీ సాగుకు సాగునీటి కష్టాలు రోజురోజుకూ ఎక్కువ అవుతున్నాయి.  చాలా చోట్ల వరి చేలు బీటలువారుతున్నాయి. పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. నీటి కష్టాలు నివారించేందుకు అధికారులు చేపట్టిన చర్యలు ఫలించడంలేదు.  కొన్నిరోజులుగా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో దాళ్వా సాగుకు నీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కోనసీమ జిల్లాలో రబీ సీజన్‌లో 1.90 లక్షల ఎకరాల్లో వరిసాగు సేద్యం చేశారు. గతంలో తొలకరి పంటను త్యాగం చేసిన రైతులు రబీ పంట సేద్యం చేస్తున్నప్పటికీ పరిస్థితులు చూస్తుంటే ఈ పంటను కూడా కోల్పోయేలా ఉందని రైతుల ఆవేదన చెందుతునన్నారు. జిల్లా వ్యాప్తంగా 69 గ్రామాల్లో 5287 ఎకరాల విస్తీర్ణంలో సాగునీటి సమస్యలు తలెత్తినట్లు జిల్లా యంత్రాంగం గుర్తించింది. వీటి నివారణకు సమీప ప్రాంతాల్లో డ్రైన్లపై క్రాస్‌బండ్‌లు వేసి రైతులకు సాగు నీటిని ఇంజిన్ల ద్వారా మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. అమలాపురం సబ్‌డివిజన్‌లో 63, రాజోలు సబ్‌డివిజన్‌లో 9, రామచంద్రపురం సబ్‌డివిజన్‌లో 18 క్రాస్‌బండ్‌లు ఏర్పాటుచేసి డ్రైన్లలో నీటిని ఎత్తిపోతల ద్వారా కాల్వ చిట్టచివరి భూములకు అందిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ హిమాన్షుశుక్లా స్పష్టం చేశారు.