Minister Kakani Govardhan Reddy :తక్కువ పెట్టుబడి, ఎక్కువ దిగుబడితో పాటు నాణ్యత, చీడపీడలను తట్టుకునే 17 రకాల నూతన వంగడాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అమరావతి సచివాలయం రెండో బ్లాక్ లో ఆవిష్కరించారు. రైతులకు ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చే ఈ నూతన వంగడాలను రూపొందించిన ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఎ.విష్ణువర్థనరెడ్డిని, శాస్త్రవేత్తలను, ఏపీ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్ పెర్సన్ పి.సుస్మితా రెడ్డిని, మేనేజింగ్ డైరెక్టర్ డా.శేఖర్ బాబును మంత్రి అభినందించారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎటువంటి భౌగోళిక, వాతావరణ పరిస్థితులనైనా ఎదుర్కొని వాణిజ్య సరళిలో సాగుకు అవకాశం ఉన్న వరి, రాగి, ప్రత్తి పంటల్లో 7 జాతీయ స్థాయి నూతన వంగడాలకు ఇప్పటికే కేంద్రం అనుమతి వచ్చిందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి చేసిన నూతన వంగడాలకు జాతీయ స్థాయిలో అనుమతి రావడం ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికే కాకుండా ఏపీకే ఎంతో గర్వకారణమన్నారు. అదే విధంగా వరి, రాగి, కొర్ర, మినుము, పెసర, శనగ, వేరుశనగ పంటల్లో 10 రాష్ట్ర స్థాయి నూతన వంగడాలను ఆవిష్కరించామన్నారు.
కొత్త వంగడాలు రైతు భరోసా కేంద్రాల్లో
రాష్ట్ర స్థాయిలో ఆవిష్కరించిన ఈ 10 నూతన వంగడాలను కూడా దేశ స్థాయిలో ఉపయోగించుకొనే అవకాశాన్ని పరిశీలించిన తదుపరి జాతీయ స్థాయి ఉపయోగానికి అనుమతి లభించినట్లైతే మరో 10 నూతన వంగడాలను దేశానికి అందించిన ఘనత రాష్ట్రానికి దక్కడం ఒక రికార్డే అని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అభివర్ణించారు. రాష్ట్ర స్థాయిలో ఆవిష్కరించిన వరి యం.టి.యు.-1318 నూతన వంగడానికి ఎంతో ప్రాచుర్యం ఉందని, రైతులు ఈ నూతన వంగడాన్ని ఎంతగానో ఆశిస్తున్నారని ఏ.పీ. సీడ్స్ అధికారులు చెపుతున్నారన్నారు. నేడు విడుదల చేసిన ఈ నూతన వంగడాలను అన్నింటినీ ఒకసారి పరీక్షించి, సర్టిపై చేసి అన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందుబాటులోకి తెస్తామని మంత్రి తెలిపారు.
సుబాబుల్ రైతులకు గిట్టుబాటు ధర
సుబాబుల్, యూకలిప్టస్ రైతులకు గిట్టుబాటు ధర చెల్లించేందుకు పేపర్ మిల్స్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. సుబాబుల్ డిబార్డ్క్ యూకలిప్టస్ రైతులకు ప్రస్తుతం చెల్లిస్తున్న ధరపై కనీసం రూ.200/- పెంచేందుకు కంపెనీల ప్రతినిధులు అంగీకారం తెల్పడంతో వారితో కాకాణి గోవర్థన్ రెడ్డి జరిపిన చర్చలు సఫలీకృతం అయ్యాయి. దళారుల ప్రమేయం లేకుండా రైతులకే నేరుగా ఈ సొమ్మును చెల్లించే విధంగా పేపర్ మిల్స్ చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. సుబాబుల్, యూకలిప్టస్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించే అంశంపై పలు పేపర్ మిల్స్ ప్రతినిధులతో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అమరావతి సచివాలయం రెండో బ్లాక్ లో సమావేశమయ్యారు. పేపర్ మిల్స్ ప్రతినిధులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి రైతులకు అన్ని విధాలుగా మేలు చేసేందుకు ఎన్నో వినూత్న కార్యక్రమాలను రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారన్నారు. బహిరంగ మార్కెట్ లో ధాన్యం, చిరుదాన్యాలు, పప్పు దినుసులు ధరలు ఏ మాత్రం రైతులకు గిట్టుబాటుగా లేని పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయడం ఆనవాయితీ అయిందన్నారు. అదే విధంగా సుబాబుల్, యూకలిప్టస్ రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో సుబాబుల్, యూకలిప్టస్ రైతులకు గిట్టుబాటు ధర చెల్లించే విషయంలో పేపర్ మిల్స్ యాజమాన్యం అండగా నిలవాలని ఆయన కోరారు. సుబాబుల్, యూకలిప్టస్ ధరలు గత ఐదారు నెలల నుంచి ఎంతో ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ఆ ధరలను మరింత ఆశాజనకంగా పెంచే విధంగా పేపర్ మిల్స్ యాజమాన్యం సహకరించాలన్నారు. మంత్రి విజ్ఞప్తికి పేపర్ మిల్స్ ప్రతినిధులు సానుకూలంగా స్పందిస్తూ రైతులకు సాధ్యమైనంత ఎక్కువ మొత్తంలో గిట్టుబాటు ధర చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.