Sugar From 1 Quintal Sugarcanes: చెరకు భారత్‌లోని అతిపెద్ద వాణిజ్య పంటలలో ఒకటిగా చెబుతారు. దేశవ్యాప్తంగా చాలా మంది రైతులు దీనిని సాగు చేస్తారు. ఇది పొలాల నుంచి చక్కెర మిల్లులకు చేరిన తర్వాత, చక్కెరగా మారుతుంది. కానీ చెరకు నుంచి చక్కెర తయారు చేయడం గురించి చాలా మందికి సందేహాలు ఉన్నాయి. 1 క్వింటాల్, లేదా 100 కిలోగ్రాముల చెరకు నుంచి ఎంత చక్కెర ఉత్పత్తి అవుతుందో అని మీరు కూడా ఆలోచిస్తున్నారా? 

Continues below advertisement

అయితే దీనికి నిర్దిష్టమైన సంఖ్య ఏదీ లేదు. ఇది చెరకు నాణ్యత, దాని తీపి,  దానిని ఎలా ప్రాసెస్ చేస్తారు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ అంశాలన్నింటి ఆధారంగా తుది ఉత్పత్తి నిర్ణయమవుతుంది. చెరకు నుంచి చక్కెర తయారు చేయడంలో అనేక దశలు ఉంటాయి. 1 క్వింటా చెరకు నుంచి ఎంత చక్కెర ఉత్పత్తి అవుతుంది. దానిని ఎలా ఉత్పత్తి చేస్తారో ఇప్పుడు వివరిద్దాం.  

క్వింటా చెరకు నుంచి ఎంత చక్కెర ఉత్పత్తి అవుతుంది?

1 క్వింటాల్ (100 కిలోల) చెరకు నుంచి ఉత్పత్తి అయ్యే చక్కెర పరిమాణం, చెరకు నాణ్యత, మిల్లు రికవరీపై ఆధారపడి ఉంటుంది. సులభంగా చెప్పాలంటే, మిల్లు రికవరీ 10 శాతం ఉంటే, 100 కిలోల చెరకు నుంచి సుమారుగా 10 కిలోల చక్కెర లభిస్తుంది. అదేవిధంగా, 11 శాతం రికవరీతో సుమారుగా 11 కిలోలు, 12 శాతం రికవరీతో సుమారుగా 12 కిలోల చక్కెర లభిస్తుంది. ఇక్కడ రికవరీ అంటే, మిల్లులో వేసిన మొత్తం చెరకు నుంచి ఉత్పత్తి అయిన చక్కెర పరిమాణం.

Continues below advertisement

అన్ని రకాల చెరకు ఒకే పరిమాణంలో చక్కెరను ఉత్పత్తి చేయదు. చెరకులో సుక్రోజ్ శాతం ఎక్కువగా ఉంటే, చక్కెర దిగుబడి మెరుగ్గా ఉంటుంది. చెరకు తాజాదనం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కోత తర్వాత చెరకు మిల్లుకు చేరడానికి ఎక్కువ సమయం పడితే, చక్కెర దిగుబడి ప్రభావితం కావచ్చు. అందుకే, చెరకు నాణ్యతతోపాటు, మిల్లుకు సకాలంలో చేరవేయడం కూడా చాలా కీలకంగా పరిగణిస్తారు. 

చెరకు నుంచి చక్కెర తయారు చేయడంలో మొదటి దశ ఏమిటి?

మిల్లులో చెరకును క్రష్ చేయడంతో చక్కెర ఉత్పత్తి ప్రారంభమవుతుంది. మిల్లుకు చేరాక, చెరకును పెద్ద యంత్రాలలో క్రష్ చేసి , దాని రసాన్ని తీస్తారు. ఈ రసంలో నీరు, సుక్రోజ్ ఇతర మూలకాలు ఉంటాయి. దీని తరువాత శుద్ధి ప్రక్రియ జరుగుతుంది, దీని ద్వారా వేస్ట్‌ను, పీచుపదార్థం  ఇతర మలినాలను తొలగిస్తారు.

శుద్ధి చేసిన తర్వాత, చెరకు రసాన్ని వేడి చేస్తారు. ఆ తర్వాత ఆవిరిని ఉపయోగించి అందులో ఉంటే నీటి శాతాన్ని తగ్గిస్తారు. క్రమంగా, రసం చిక్కబడి పాకంలా మారుతుంది. ఈ చిక్కటి రసాన్ని తదుపరి ప్రక్రియకు పంపుతారు, అక్కడ చక్కెర స్ఫటికాలు ఏర్పడతాయి. చెరకును క్రష్ చేయడం నుంచి రసాన్ని చిక్కబరచడం వరకు ప్రతి దశ, తుది చక్కెర వెలికితీతలో కీలక పాత్ర పోషిస్తుంది.

చక్కెర స్ఫటికాలు ఎలా తయారు చేస్తారు?

చెరకు రసం తగినంత చిక్కబడిన తర్వాత, దానిని స్ఫటికీకరణ అనే తదుపరి దశకు పంపుతారు. ఇక్కడ, నిర్దిష్ట ఉష్ణోగ్రతలు, కచ్చితమైన పరిస్థితుల్లో చిన్న చక్కెర స్ఫటికాలు ఏర్పడతాయి. ఆ తర్వాత ఈ స్ఫటికాలను మిగిలిన ద్రవం నుంచి వేరు చేస్తారు. ఈ స్ఫటికాలను మరింత శుద్ధి చేసి, మనం ఇళ్లలో ఉపయోగించే రేణువుల చక్కెరగా తయారు చేస్తారు. చెరకులోని చక్కెర అంతా ఉపయోగించే చక్కెరగా మారదు; ఈ ప్రక్రియలో కొంత చక్కెర వివిధ భాగాలలో మిగిలిపోతుంది.

చక్కెర ఉత్పత్తిలో చక్కెరతోపాటు చాలా పదార్థాలు వస్తాయి. చెరకును క్రష్ చేసిన తర్వాత మిగిలిపోయిన పీచును బగాస్ అంటారు. దీనిని మిల్లులో విద్యుత్తును ఆవిరిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు. మొలాసిస్ కూడా ఉత్పత్తి అవుతుంది, దీనిని ఇథనాల్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. చక్కెర మిల్లులలో చెరకును శుద్ధి చేసే ప్రక్రియలో ప్రెస్‌మడ్ కూడా ఒక ఉపయోగకరమైన ఉత్పత్తి.

అందువల్ల, ఒక క్వింటా చెరకు కేవలం చక్కెరను మాత్రమే ఉత్పత్తి చేయదు. ఇది అనేక ఇతర ఉపయోగకరమైన ఉత్పత్తులను కూడా ఇస్తుంది. ఉత్పత్తి అయ్యే చక్కెర పరిమాణం చెరకు నాణ్యత, మిల్లులో జరిగే ప్రాసెసింగ్‌పై ఆధారపడి ఉంటుంది. అందువల్ల, ప్రతి 100 కిలోల చెరకు నుంచి ఉత్పత్తి అయ్యే చక్కెర పరిమాణం మారవచ్చు.