UIDAI Aadhaar Card Update: భారత పౌరులకు ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆధార్ కార్డుకు సంబంధించి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. మీరు ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లయితే కనుక వెంటనే ఈ అప్‌డేట్ (Aadhaar Card Update) చేసుకోండి. ఆధార్ పొంది పదేళ్లు దాటిన వారు.. గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాలను మళ్లీ సమర్పించాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) సూచించింది. గత పదేళ్లలో ఆధార్‌ను ఒక్కసారి కూడా అప్డేట్ (Aadhaar Card Update) చేయనివారు ఈ పని చేయాలని కోరింది. అయితే ఐడెంటిటీ, రెసిడెన్స్ ప్రూఫ్ డాక్యుమెంట్లను సమర్పించడం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియను మై ఆధార్ పోర్టల్‌తోపాటు దగ్గర్లోని ఆధార్ సెంటర్లలో నిర్దేశిత రుసుము చెల్లించి చేసుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతం ఆధార్ కలిగిన వారి శాతం 93 శాతం కంటే ఎక్కువే. దేశంలో దాదాపు 50,000 ఆధార్ అప్డేట్ కేంద్రాలు ఉన్నాయి. ఫోన్ నంబర్, చిరునామాలను అప్డేట్ చేసేందుకు 1,50,000 మంది పోస్ట్ మ్యాన్లను వినియోగిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. దీని ద్వారా నకిలీ లబ్ధిదారులను గుర్తించి నిధులు దుర్వినియోగం కాకుండా.. ప్రజాధనం ఆదా చేయడానికి సహాయపడుతుందని తెలిపింది. ఆధార్ నంబర్‌ను ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక సహా ఇతర అవసరాలకు ప్రభుత్వం ఉపయోగిస్తోంది.