ఇండియన్ స్టాక్ మార్కెట్లను అమెరికన్ బ్యాంక్‌ల రూపంలో మరో సంక్షోభం చుట్టుముట్టింది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ దివాలా పడటంతో భారతీయ స్టాక్ మార్కెట్లు కొట్టుకుపోయాయి. గత మూడు ట్రేడింగ్ సెషన్లలో BSE ఇన్వెస్టర్లు రూ. 6.6 లక్షల కోట్ల మేర నష్టపోయారు. ఈ మూడు రోజుల్లో సెన్సెక్స్ దాదాపు 2,000 పాయింట్లు క్రాష్ అయ్యింది. ఇవాళ, ఒకదశలో సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోయింది. డే-హై నుంచి 1300 పాయింట్ల మేర క్షీణించింది. చివరకు, 1.52% లేదా 897 పాయింట్ల నష్టంతో 58,238 వద్ద ముగిసింది. నిఫ్టీ 1.48% లేదా 259 పాయింట్ల నష్టంతో 17,154 వద్ద స్థిరపడింది, కీలకమైన 17,200 స్థాయిని కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 2.27% లేదా 920 పాయింట్ల నష్టంతో 39,564 పాయింట్ల వద్ద రోజును ముగించింది. ఈరోజు అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవడంతో, ఫియర్ గేజ్ ఇండెక్స్ 'ఇండియా VIX' 15% పెరిగింది. బిట్‌కాయిన్ (Bitcoin) 8.88 శాతం పెరిగి రూ.18.21 లక్షల వద్ద కొనసాగుతోంది.