నక్షత్రం ప్రకారం పేరు పెట్టకపోతే!



జన్మ నక్షత్రం ప్రకారమే పేరు పెట్టాలా-నచ్చిన పేరు పెట్టుకోవచ్చా? వాస్తవాలేంటి-అపోహలేంటి? అప్పట్లో జన్మ నక్షత్రం ప్రకారం పేర్లెందకు పెట్టేవారు? ఆంతర్యం ఏంటి?



పేర్లను రెండు రకాలుగా నిర్ణయిస్తారు…
1.జన్మ నక్షత్రం- జన్మ నక్షత్రం అంటే పుట్టిన సమయాన్ని బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవడం
2. నామ నక్షత్రం- మీ పేరులో ఉండే మొదటి అక్షరం ఆధారంగా నక్షత్రం తెలుసుకోవడం



ఎలా తెలుసుకున్నా ఒకటే ఫలితం. కానీ ఇప్పటికీ నక్షత్రం ప్రకారం పేర్లు పెట్టకపోతే ఏదో జరిగిపోతుందనే మూఢవిశ్వాసం చాలామందిలో ఉంది.



వాస్తవానికి ఆరోజు ఉన్న నక్షత్రానికి సంబంధించిన అక్షరంతో పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఏపేరైనా నిర్ణయించుకోవచ్చు.



పూర్వీకులంతా ఇదే పద్ధతి అవలంబించారు కదా ఇప్పుడెందుకు అవసరం లేదంటున్నారనే సందేహం వచ్చిందా?...దానికి సమాధానం ఏంటంటే…..



ముందు తరం వాళ్లకి నక్షత్రాలు, రాశులు, ముహూర్తాలపై అంత అవగాహన లేదు. శుభకార్యమైనా, అశుభమైనా తమకు తెలిసిన బ్రాహ్మణుడి వద్దకెళ్లి మంచి చెడులు అడిగేవారు. ఏ ముహూర్తం పెట్టాలన్నా తిథి కన్నా నక్షత్రమే ప్రధానం.



మీ పిల్లల నక్షత్రాలేంటని అడిగితే చెప్పలేకపోయేవారు. అందుకనే అప్పట్లో వాళ్లు... పుట్టిన నక్షత్రాన్ని సూచించే అక్షరంతో మొదలయ్యే పేరు పెట్టేవారు. అంటే పేరు చెప్పగానే నక్షత్రం ఏంటో తెలిసిపోతుందన్నమాట.



ఆయా వ్యక్తుల మొదటి అక్షరం ఆధారంగా వారి నక్షత్రం ఏంటో గ్రహించి ముహూర్తం నిర్ణయించేవారు. ముఖ్యంగా పెళ్లి సంబంధం కుదిరేటప్పుడు గణాలు లెక్కపెట్టాలన్నా… ముహూర్తం నిర్ణయించాలన్నా నక్షత్రమే ప్రధానం.



గతంతో పోల్చకుంటే ఇప్పుడు అందరికీ ఈ విషయాలపై ఆసక్తి పెరిగింది. పుట్టిన వెంటనే డేట్, టైమ్ నోట్ చేసుకుంటున్నారు. నక్షత్రం ఏంటో తెలుసుకుంటున్నారు. చక్రాలు వేయించేస్తున్నారు..జాతకాలు రాయించేస్తున్నారు.



ఇంకా చెప్పాలంటే ముహూర్తం, నక్షత్రం నిర్ణయించుకున్నాకే బిడ్డను కంటున్నారు. ఇంత అవగాహన ఉన్నప్పుడు నచ్చిన పేరు పెట్టుకోక…నక్షత్రాన్ని తెలియజేసి పేరు తప్పనిసరిగా పెట్టుకోవాలనేం లేదు..అలా పెట్టుకోపోతే ఏమీ అయిపోదు...