Tornado ravages Medaram forest | మేడారం అడవిలో వేలసంఖ్యలో పెలికించుకుపోయిన వృక్షాలు | ABP Desam
భారీ వర్షాలు..వరదలు మనుషులకు ఎంతటి కష్టాలను మిగిల్చాయో విజయవాడ, ఖమ్మం ప్రజలను చూస్తే అర్థమవుతోంది. కానీ అదే స్థాయిలో ప్రకృతికి తీరని చేటు చేసింది. తెలంగాణ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ములుగుజిల్లాను చుట్టేసిన సుడిగాలులు బీభత్సాన్ని సృష్టించాయి.ఇదిగో ఈ దృశ్యాలే ఆ ఘోర విపత్తుకు నిదర్శనం.ములుగు జిల్లాలోని తాడ్వాయి నుంచి మేడారం రోడ్డు మార్గంలో ఏర్పడింది ఈ విపత్తు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లన్నీ నేలకూలిపోయాయి. లోపలికి వెళ్లి చూసిన అటవీశాఖ అధికారులకు షాక్. భారీ సుడిగాలులకు వేలాది చెట్లు నేలరాలిపోయి కనిపించాయి. డ్రోన్లను ఉపయోగించి ఎంత నష్టం జరిగిందో గమనించిన అధికారులు ఈ విజువల్స్ చూసి ఆశ్చర్యపోయారు. దాదాపుగా 50వేల చెట్లు నేలకొరిగిపోయి కనిపిస్తున్నాయి. దాదాపుగా 150కిలోమీటర్ల వేగంతో వచ్చి సుడిగాలులు, గాలి వాన బీభత్సానికి వేలాది చెట్లు ఇలా పెకిలించుకోపోయాయని అధికారులు అంచనా వేస్తున్నారు.ఘటన జరిగిన ప్రాంతానికి మంత్రి సీతక్క అధికారులతో కలిసి వెళ్లారు. ఆ ప్రాంతమంతా కలియతిరిగారు. అధికారులు ఈ విపత్తుకు కారణం సుడిగాలులు అయ్యి ఉండొచ్చని భావిస్తున్నారు. అనేక ఔషధ మొక్కలు,అరుదైన వృక్షాలు నేలకొరిగినట్లు గుర్తించిన అధికారులు ఆ వివరాలను సీతక్కకు తెలియచేశారు. వైల్డ్ లైఫ్ జోన్ గా ములుగు జిల్లా అడవుల్లో జరిగిన ఈ విపత్తును కేంద్ర మంత్రివర్గంలో ఉన్న బండి సంజయ్, కిషన్ రెడ్డి పట్టించుకుని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లాలని మంత్రి సీతక్క కోరారు.