నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి
నిర్మల్ జిల్లాలో మళ్లీ పులి సంచారం కలకలం రేపుతోంది. గత రెండు రోజులుగా మామడ రేంజ్ సరిహద్దు ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు తెలిపారు. మామడ రేంజ్ అధికారి రాథోడ్ అవినాష్ అటవీశాఖ సిబ్బందితో కలిసి పులి పాదముద్రలు సేకరించారు. ఈ విషయమై ఏబిపి దేశం వేర్వేరు ప్రాంతాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లను ఫోన్ ద్వారా వివరణ కోరగా.. పులి సంచారం వాస్తవమేనని వివరించారు. ఇది కవ్వాల్ అభయారణ్యం నుండి వచ్చిన పులి అని భావిస్తున్నారు. మామడ రేంజ్ పరిధిలోని సమీప గ్రామాల గుండా అది నిర్మల్ రేంజి ప్రాంతం వైపు దిమ్మదుర్తి ఏరియాలోకి వెళ్లిన్నట్లు తెలిపారు. పులికి ఎలాంటి హాని తలపెట్టకుండా, రైతులు గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఎవరి పశువుల పైన పులి దాడి చేసిన, హతమార్చిన వాటికి తాత్కాలికంగా రూ.5000 , అలాగే పూర్తి పరిహారం వారంలోపు ఇచ్చే విధంగా అటవీ శాఖ చర్యలు చేపడుతుందన్నారు.