Tension Errupt at Puranapul | మైసమ్మ ఆలయంపై ఆగంతుకుడి దాడి, ఉద్రిక్తత | ABP Desam
హైదరాబాద్ లో పూరానాపూల్ దర్వాజా ఓ దారుణం జరిగింది. అర్థరాత్రి సమయంలో మైసమ్మ ఆలయంలోకి ఓ ఆగంతుకుడు చొరబడ్డాడు. అమ్మవారి విగ్రహాన్ని, చిత్రపటాలను, అక్కడి పూజా సామగ్రిని చెల్లాచెదురు చేశాడు. ఆ ఆగంతుకుడి చర్యలను గమనించిన స్థానికులు ఆ వ్యక్తి ని పట్టుకునేందుకు ప్రయత్నించగా, అతను పారిపోయినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న స్థానికులు ఆలయం వద్దకు చేరుకుని ధర్నా చేశారు. రోడ్లపై బైఠాయించి వాహనాలను అడ్డుకుని తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. విధ్వంసానికి పాల్పడిన వ్యక్తిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. దీంతో పురానాపూల్ దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని 24 గంటల్లో పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. నిందితుడి ఆధారాలు దొరికాయని..కేసు రిజిస్టర్ చేశామని..వీలైనంత త్వరగా నిందితుడిని అరెస్ట్ చేస్తామని హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ జాయింట్ పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ప్రకటించారు.