ప్రేక్షక ఆదరణ కోసం 140 ఏళ్ల సురభి | ABP Desam
సురభి నాటక మండలి. తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు. సినిమాలు ఇంతలా మన జీవితాల్లో ముడివేసుకోనప్పుడు తెలుగు ప్రజల వ్యాపకం అంటే సురభి వాళ్లు ఆడే నాటకాలు చూడటమే. ఊరి జాతరలోనో లేదా ప్రత్యేక సందర్భాల్లో సురభి పిలిపించి నాటకం వేయిస్తున్నారంటే చాలు ఊళ్లకు ఊళ్లు ఎడ్ల బండ్లు కట్టుకుని మరీ వచ్చేవాళ్లు. అంత స్థాయిలో తెలుగు ప్రజల హృదయాలతో ముడిపడిపోయిన సురభి నాటక మండలి ప్రస్తుతం నిరాదరణకు గురవుతోంది. సినిమాలు, ఇప్పుడు మెటావర్స్, వీఆర్, ఏఆర్ అంటూ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత నాటకాలే జీవితంగా బతికే వీరి కళ ప్రజలకు అవసరం లేకుండా పోయింది. అక్షరాలా 140 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సురభి నాటక మండలి ఇటీవలే తెలంగాణలోని స్వర్ణగిరిలో నాటకం ప్రదర్శించిన సందర్భంగా వారి కళా వైభవాన్ని రికార్డు చేసే అవకాశం దక్కింది. సురభి కళాకారులు చేసే నాటకాల్లో కట్లు, రీటేక్లు ఉండవు. ఎంత క్లిష్టమైన డైలాగ్ చెప్పాలన్నా, ఎంత కఠినమైన పాట ను పాడాలన్నా సింగిల్ టేక్ లో వాళ్లే చెబుతారు పాడి ప్రేక్షుకులను మెప్పిస్తారు. చుట్టూ పందిరి, లైవ్ సౌండ్ & విజువల్ ఎఫెక్ట్స్, ఒకే వేదికపై విభిన్న రకాల పాత్రలతో సురభి కళాకారులు చేసే సందడి అంతా ఇంతా కాదు. తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద ట్రెడీషల్ థియేటర్ గ్రూప్ అయిన సురభినే నమ్ముకుని ఏడెనిమిది తరాలుగా జీవిస్తున్న కళాకారులు ఉన్నారు.