
SLBC Tunnel Incident Update | NDRF అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూ | ABP Desam
నాగర్ కర్నూల్ శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ బ్రాంచ్ సొరంగంలో జరిగిన ప్రమాదంలో NDRF బలగాల సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. మొత్తం సొరంగం పొడవు 44 కిలోమీటర్లు కాగా 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం జరిగింది. మట్టి పెళ్లలు, రాళ్లు రప్పలు ఊడిపడిపోవటంతో పాటు లోపల ఉన్న గడ్డర్లు కూలిపోవటంతో ఈ ప్రమాదం జరిగింది. ఫలితంగా 8 మంది చిక్కుకుపోగా వాళ్లున్న ప్రాంతమంతా బురద,నీటితో నిండిపోయిందని NDRF బలగాలు గుర్తించాయి. 12కిలోమీటర్ల పాటు ట్రాక్ మార్గం ద్వారా లోపలికి వెళ్లిన NDRF బలగాలు అక్కడ నుంచి కాలినడకన మరో రెండు కిలోమీటర్ల పాటు ప్రయాణించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ ఇక్కడే అసలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి మొత్తం బురద నిండిపోయి ఉండటానికి అటువైపు ఉన్న వారికి సమాచారం చేరవేసే మార్గం లేకుండా పోయింది. ఇప్పటికీ 8మంది ఎక్కడున్నారు అనే విషయం తెలియటం లేదని NDRF దళాలు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లికి వివరించాయి. అధికారులతో కలిసి రివ్యూ పెట్టిన మంత్రి ఉత్తమ్ అత్యవసరంగా ఆర్మీ,నేవీ సహాయం తీసుకుని నీటిని, బురదను తొలగించాలని NDRF బలగాలను కోరారు. ఘటన స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలను ముందుండి నడిపిస్తున్నారు.