కొడుతూ వీడియోలు తీస్తుందని... పీఈటీపై విద్యార్థినుల ఆగ్రహం
తెలంగాణల్లోని గురుకుల పాఠశాలల్లో గత కొంత కాలంగా ఏదో ఒక రకమైన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో ఇటీవలే విద్యార్థి పాముకాటుకు గురైన సంఘటన మరువకముందే పెద్దపెల్లి జిల్లాలో సరిగ్గా ఇలాంటిదే మరో పాముకాటు ఘటన చోటు చేసుకుంది. పెద్దపెల్లి జిల్లాలో ఉన్న సుల్తానాబాద్ మండలంలోని గురుకుల పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి పాముకాటుకు గురి కావడంతో అప్పటికప్పుడు ఆగమేఘాల మీద పెద్దపెల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాల్సి వచ్చింది. ఈ విధంగా అనేక సమస్యలతో గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు సతమతం అవుతున్న నేపథ్యంలో సిరిసిల్ల జిల్లాలోని గురుకుల సాంఘిక సంక్షేమ కళాశాలలో మరొక సమస్య వెలుగులోకి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన తంగళ్ళపల్లి మండలంలోని ఇందిరమ్మ కాలనీలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. నెలసరిలో ఉన్న సమయంలో విద్యార్థినులు బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు జోత్స్న అనే టీచర్ లేట్ అవుతుందని డోర్ పగలగొట్టి లోనికి వచ్చి ఫోన్‌తో వీడియో రికార్డు చేస్తూ తమని కొడుతుందని విద్యార్థినులు ఆందోళనకు దిగారు. పీఈటీ టీచర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు.