బలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు, నొప్పితో విలవిలలాడిన హరీశ్ రావు
కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య గొడవ ముదురుతోంది. కౌశిక్ రెడ్డి ఇంటికి అరికెపూడి గాంధీ వెళ్లడం, ఆ తరవాత ఇద్దరూ సవాళ్లపైన సవాళ్లు విసురుకోవడం వల్ల ఈ వివాదం మరింత రాజుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తానూ అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లి తీరతానని కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. ఇప్పటికే హరీశ్ రావు అరెస్ట్‌తో రాజకీయ వేడి పెరిగింది. ఒక్కసారిగా బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌ని ముట్టడించారు. వాళ్లని కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే హరీశ్‌రావు పట్ల పోలీసులు కర్కశంగా వ్యవహరించారంటూ బీఆర్ఎస్ తీవ్రంగా మండి పడుతోంది. ఆయన భుజం నొప్పితో బాధ పడుతున్నా...ఏ మాత్రం కనికరం లేకుండా లాక్కెళ్లారని ఫైర్ అవుతోంది. గాయమై తీవ్ర ఇబ్బంది పడుతున్నా...పోలీసులు హరీశ్ రావుని బలవంతంగా పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్లారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ కొట్లాటలు తమకు కొత్తేమీ కాదని, ఎంత అణిచివేయాలని చూస్తే అంత ఉద్యమిస్తామని తేల్చి చెప్పింది.