Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desam
దేశంలో కేంద్ర ప్రభుత్వానికి అంతర్గత భద్రత విషయంలో కంట్లో నలుసుగా మారింది మావోయిస్టు పార్టీ. దేశ అభివృద్ధికి మావోలు ఆటంకం అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంటే, దేశ సంపదను ప్రజలకు పంచకుండా గంప గుత్తగా ఒకరిద్దరు పెట్టుబడి దారుల చేతుల్లో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని మావోయిస్టు పార్టీ ఆరోపిస్తుంది. 2026 నాటికి మావోయిస్టు పార్టీని దేశంలో అంతం చేయడమే మా లక్ష్యం అని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు ప్రకటిస్తే, మీ ఆపరేషన్ కగార్ ను అడ్డుకుని తీరడమే మా పంతం అని మావోయిస్టులు ప్రకటిస్తున్నారు. మహరాష్ట్ర, చత్తీస్ ఘడ్, ఆంధ్ర - ఒరిస్సా బోర్డర్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో అంటే మావోయిస్టుల ప్రభావ ప్రాంతాల్లో ఓ యుద్దమే జరుగుతుందని చెప్పాలి. నిత్యం తుపాకి చప్పుళ్లతో, మందు పాతర పేళ్లుళ్లతో అటవీ గ్రామాలు చిగురుటాకుల్లో వణికిపోతున్నాయి. పచ్చటి అడవిలో వెచ్చటి నెత్తురు వర్షం కురుస్తోంది. ఇంతటి భీతావాహ పరిస్థితులు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నెలకొంది.