KCR Letter to Justice L Narasimha Reddy Commission | 12 పేజీల లేఖతో వివరణ ఇచ్చిన కేసీఆర్
విద్యుత్ కొనుగోలు అంశపై మాజీ సీఎం కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు 12 పేజీల లేఖ రాశారు. తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్ల అంశంలో మాజీ సీఎం కేసీఆర్‌కు జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ఇటీవల నోటీసులు ఇచ్చారు. జూన్ 15(నేడు) లోపు వివరణ ఇవ్వాలన్నారు. అందుకు తగ్గట్లుగానే కేసీఆర్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. అందులో తాను విచారణకు ఎందుకు హాజరు కావట్లేదో తెలుపుతూ.. అసలు కమిషన్ స్వతంత్రంగా పని చేస్తుందున్న నమ్మకం తనకు లేదని చెప్పారు. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో అన్ని రకాల నిబంధనలను పాటిస్తూ ముందుకెళ్లినట్లు లేఖలో పేర్కొన్నారు. ఈఆర్సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై కమిషన్లు వేయకూడదన్నారు. ఈ విషయం కూడా రేవంత్ రెడ్డి సర్కార్ కు తెలియదా అంటూ అగ్రహం వ్యక్తం చేశారు.
విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన కరెంట్ ఏ మాత్రం సరిపోదు. విద్యుత్ పంపిణీ వ్యవస్థ పటిష్ఠానికి నిర్మాణాత్మక చర్యలు తీసుకున్నాం. అన్ని రకాల అనుమతులు పొంది ముందుకు పురోగమించడం జరిగింది. రాజకీయ కక్షతో నన్ను, అప్పటి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాల్జేయడానికే కమిషన్ ఏర్పాటు చేశారు. విచారణ అనేది ఒక పవిత్రమైన బాధ్యత. ఇరుపక్షాల మధ్య మధ్యవర్తిగా నిలిచి నిగ్గుతేల్చాలి. అన్ని కోణాల్లో సమగ్రంగా పరిశీలించి నిర్ణయాలు వెల్లడించాలి. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలని మాట్లాడుతున్నట్లుంది. మీ విచారణలో నిష్పాక్షికత ఎంతమాత్రం కనిపించట్లేదు. నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు. మేం చెప్పిన అంశాలను పరిగణనలోకి మీరు కమిషన్ బాధ్యతల నుంచి వైదొలగాలని వినయపూర్వకంగా కోరుతున్నా కేసీఆర్ తెలిపారు.