Kaloji Kalakshetram in Warangal | ఠీవీగా కాళోజీ కళాక్షేత్రం
వరంగల్ లో కాళోజీ కళాక్షేత్రం ముస్తాబైంది. హన్మకొండలో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రం విద్యుత్ కాంతుల్లో ప్రత్యేకంగా ఆకర్షణ నిలుస్తుంది. మొత్తం 4.2 ఎకరాల విస్తీర్ణంలో 95 కోట్ల వ్యయంతో ఈ కళాక్షేత్రాన్ని నిర్మించారు. విశాలమైన నాలుగు అంతస్తుల భవనం నవంబర్ 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది. ఇందులో ఆహుతుల వీక్షణకు 1127 సీట్లతో ఆడిటోరియంతో పాటు.. ప్రత్యేకమైన ఆర్ట్ గ్యాలరీ కూడా ఉంది. కళాక్షేత్రం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దివంగత ప్రజా కవి కాళోజీ నారాయణరావు విగ్రహాన్ని కూడా రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం గ్రాండ్ గా ఏర్పాట్లు చేసింది. కాళోజీ ఘనతను భావి తరాలకు తెలియ చేసేలా కార్యక్రమం ఉంటుందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో వరంగల్ లో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసులు బందోబస్తుతో వరంగల్ నగరం హడావిడి వాతావరణాన్ని సంతరించుకుంది. కాళోజి అభిమానులు, తెలంగాణ కవులు రచయితలు ఈ కళాక్షేత్రం ప్రారంభం కానుండటంతో సంతోషంగా ఉన్నారు.