Kakatiya University Student Unions on NEET | నీట్ అవకతవకలపై కాకతీయ వర్సిటీ విద్యార్థి సంఘాల ఫైర్
నీట్ వ్యవహారం రచ్చకెక్కుతోంది. నీట్ పరీక్షను నిర్వహించిన తీరుపై కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష నీట్ యూజీ 2024 (NEET-UG 2024) పరీక్షల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదం సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. దీనిపై జూన్ 18న విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన అంశం కాబట్టి దాన్ని పరిశీలించడం చాలా ముఖ్యమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 'నీట్' నిర్వాహణలో 0.001% నిర్లక్ష్యం ఉన్నా చర్యలు తీసుకోవాల్సిందేననంటూ కేంద్రం, ఎన్టీఏకు నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సకాలంలో తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. ఈ పొరపాటు వల్ల ఎవరైనా డాక్టర్‌గా మారితే అది సమాజానికి చాలా హానికరమని కోర్టు పేర్కొంది. పిటిషన్‌పై జులై 8లోగా సమాధానమివ్వాలని ఆదేశిస్తూ.. ఎన్టీఏకీ సుప్రీంకోర్టు మంగళవారం (జూన్ 18) నోటీసులు జారీ చేసింది. నీట్ అవకతవకలకు సంబంధించి ఎన్టీఏ ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై వివరాలను వెల్లడించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది దినేష్ జోత్వాని మాట్లాడుతూ.. నేటి (జూన్ 18) విచారణ విద్యార్థికి ఎంతో మేలు చేసిందన్నారు. దేశ ఆరోగ్య వ్యవస్థతో మీరు ఆడుకుంటున్నారని ఎన్టీఏను కోర్టు మందలించిందని ఆయన తెలిపారు.