హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు
తెలంగాణలో హైడ్రా ఎఫెక్ట్ జోరుగా కొనసాగుతోంది. హైదరాబాదులో ఇప్పటికే పలు చోట్ల హైడ్రా ఎఫెక్ట్ తో కూల్చివేతలు జరిగాయి. అక్రమ నిర్మాణాలు ఎక్కడ ఉన్నా వెంటనే కూల్చేస్తున్నారు. ఇప్పుడు మంచిర్యాల జిల్లాలోను హైడ్రా దూకుడు కొనసాగుతోంది. నస్పూర్ మున్సిపాలిటీలో...ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 42లో అక్రమంగా నిర్మించిన భవనాన్ని అధికారులు కూల్చివేశారు. బీఆర్ఎస్ నేత డీకొండ అన్నయ్యకి చెందిన...ఐదంతస్తుల భవనాన్ని.. పోలీసు బందోబస్తు మధ్య మున్సిపల్, రెవెన్యూ శాఖ అధికారులు కూల్చివేశారు. కూల్చివేతను అడ్డుకోవడానికి ప్రయత్నించిన కుటుంబ సభ్యులను స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ భవన నిర్మాణానికి సర్వే నంబర్ 40లో అనుమతులు తీసుకుని సర్వే నంబర్ 42లో భవన నిర్మాణం చేపట్టారని...నస్పూర్ మున్సిపల్ కమిషనర్ తెలిపారు. 2022 నుంచి నోటీసులు ఇస్తున్నా..పట్టించుకోలేదన్నారు. 15 రోజుల కిందట కూడా నోటీసులు జారీ చేశామని చెప్పారు. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో మరిన్ని అక్రమ కట్టడాలు ఉన్నట్టు గుర్తించామని అన్నారు. త్వరలోనే వాటినీ గుర్తించి, నిబంధనల ప్రకారం..కూల్చివేస్తామని స్పష్టం చేశారు.