Indian Navy VLF Station: నేవీ VLF స్టేషన్ అంటే ఏంటి? వికారాబాద్‌ అడవుల్లోనే ఎందుకు?

Continues below advertisement

వికారాబాద్ జిల్లా దామగుండంలో ఇండియన్ నేవీకి చెందిన వీఎల్ఎఫ్ స్టేషన్‌కు శంకుస్థాపన జరిగింది. వీఎల్ఎఫ్ అంటే వెరీ లో ఫ్రీక్వెన్సీ. దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ స్టేషన్ అయిన దీనికి డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్‌ సింగ్‌ శంకుస్థాపన చేశారు. ఈ వీఎల్ఎఫ్ స్టేషన్ ఏర్పాటు కోసం నేవీ వికారాబాద్‌ జిల్లాను ఎంచుకోగా.. పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో దాదాపు 2,900 ఎకరాల అటవీ భూమిని తెలంగాణ ప్రభుత్వం విశాఖపట్నం కేంద్రంగా పనిచేసే ఈస్టర్న్‌ నావెల్‌ కమాండ్‌’కు అప్పగించింది. దామగుండంలో ఈ నేవీ రాడార్‌ స్టేషన్‌తో పాటు టౌన్‌షిప్‌ నిర్మాణం కూడా జరుగుతుంది. దీంట్లో స్కూళ్లు, హాస్పిటళ్లు, బ్యాంకులు, సూపర్ మార్కెట్లు లాంటివి కూడా ఉంటాయి. ఈ వీఎల్ఎఫ్ స్టేషన్ పూర్తయితే నేవీకి చెందిన సుమారు 600 మంది ఉద్యోగులు ఇక్కడ పని చేయబోతున్నారు. మొత్తానికి ఈ టౌన్‌షిప్‌లో సుమారు 2,500-3,000 మంది నివసించే అవకాశం ఉంటుంది. అంతేకాక, ఇక్కడికి రోడ్డు సౌకర్యాలు మెరుగుపడతాయి. ఈ వీఎల్‌ఎఫ్‌ స్టేషన్ ని 2027 లోగా కంప్లీట్ చేయాలని చూస్తున్నారు.

తమిళనాడులోని తిరునెల్వేలిలో ఉన్న ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ మన దేశంలోనే మొదటిది. 1990 నుంచి అది నావికా దళానికి సేవలందిస్తోంది. రెండో రాడార్ స్టేషన్ ఏర్పాటు కోసం తెలంగాణ అనువైన ప్రాంతంగా విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ ఇప్పటికే గుర్తించింది. సముద్రంలోని నేవీ షిప్స్, సబ్ మెరైన్స్‌తో కమ్యూనికేట్ చేసేందుకు నేవీ ఈ వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్ మిషన్ స్టేషన్ ను ఉపయోగిస్తుంది. సముద్రంలేని రాష్ట్రంలో నేవీ రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేస్తుండడం ఏంటని.. పలు పర్యావరణ సంస్థల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వు ఫారెస్ట్‌లో రాడార్ స్టేషన్ నిర్మాణం చేపట్ట వద్దని అంటున్నారు. ఆ నిర్మాణం చేపడితే జీవ వైవిధ్యంపై ప్రభావం పడుతుందని అంటున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram